గరుడపంచమీవ్రతము
117
బలపరాక్రమంబులు గలవాడు, ఆతఁడు తల్లిదగ్గఱఁ బెరుగుచునుండునప్పు డొక్కదినంబునఁ దల్లినిజూచి, “ఓతల్లీ ! నీ వేల సవతియింటఁ బనికత్తెవై యున్నావు?” అని యడిగెను. ఆమాటకు సుపర్ణి తనకొడుకుతో “ఓరీనాయనా ! నీవిప్పుకు స్వర్గలోకము నుండి యమృతంబుతెత్తు వేని నాదాస్యము తొలఁగిపోవు" ననిచెప్పెను. అంత గరుడుఁ డమృతంబు తెచ్చుటకై స్వర్గలోకం బునకుఁబోయెను.ఇంద్రుడు మొదలగు వేల్పులందఱు శస్త్రాస్త్రములను గైకొని యమృతంబు గొనిపోవచ్చిన యాగరుత్మతుని నడ్డగించిరి, ఆగరుడుఁడు వారి బాణములను వారిని తనఱెక్క డెబ్బలతో నడంచి, వారందఱు చూచునప్పుడే క్షణములోపల నమృతంబు గైకొనిపోయి తనసవతితల్లి ముందట నుంచెను. అది చూచి యాసవతి తల్లి యగు కద్రువు దానిని గైకొని “నీ దాస్యము తొలఁగెను. సుఖముగా పొమ్మ” అని వినతకు దాస్యవిమోచనము నొసఁగెను. ఇంద్రాదులు వచ్చి యాయమృత కలశమును గైకొనిపోయిరి. ఇట్టికార్యముల నాగరుడుఁ డెన్నియో యాచరించియున్నాడు. అతనిజననమును సామర్థ్యమును గూర్చి మీకు విస్తరించి వేఱొకచోటఁ జెప్పితిని. ఇతఁడు ఈ పంచమినాఁడు పుట్టుటచే నీదినమునకు గరుడపంచమి యని నామంబు వచ్చెను. (ఎవ రీగరుడపంచమి వ్రతంబు నాచరించి,యీకథను వినుచున్నారో, లేక, చదువుచున్నారో వారు సకలపాప వినిర్ముక్తులై యుత్తమగతిని బొందుచున్నారు.)
ఇది గరుడపంచమీ వ్రతకథ సంపూర్ణము.