Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

క్రీడాభిరామము

(అక్కలు) యిలువేల్పు. ఈ దేవి యిలువేల్పుగాఁ గల యిండ్లలో వివాహాది శుభకార్యములు జరగినతోడనే యక్కలకొల్పును జరుగును. ఆనాఁడేడుగురు ముత్తైదువుల కర్చనము జరుగును. ఆంగ్లేయుల యుద్ధగీతములవలె నుద్రేకజనక మైనగాన ఫణితిని కామేశ్వరిపాట వీరవాద్యములతో నానాఁడు పాడుదురు. ఆ పాట తీవరములో స్త్రీలకు కొందఱకు సివమెత్తును. ఆ యర్చనము జరగునాఁ డెంత తొందరించినను భోజనములగుటకు సూర్యాస్తమయ మగును. " అక్కలు లేచేటప్పటికిక నక్కలు కూస్తయి” అని నానుడి. నే నీ యక్కల కథ నముద్రితములుగానున్న యాదిలక్ష్మీ విలాసము, కామేశ్వరి చరిత్రము ననుగ్రంథముల మూలముఁగనుఁగొనఁ గల్గితిని. [1]కామేశ్వరి నిలవేల్పునుగా నర్చించువారు పలువురెఱుఁగఁ గోరుచున్నారుగాన తత్కథాసారము నిక్కడ తెల్పుచున్నాడను.

కామేశ్వరి కథ

శ్రీ మహావిష్ణువు శ్రీరామావతారమున నుండఁగా శ్రీమహాలక్ష్మి చూచి తన్మూర్తిని వలచెను. తనవాంఛ దీర్ప నుత్తరీయాంచలము నందుకొని వేఁడెను. రామచంద్రమూర్తి యేకపత్నీవ్రతుఁడ ననెను. అవతారభేదమే కాని నీవు నాభర్తవే యని లక్ష్మీదేవి నిర్బంధించెను. రామచంద్రమూర్తి గర్హించెను. నన్నిట్లీ యవతారమున దుఃఖపెట్టితివి గాన, యింకొకయవతార మెత్తి యిలువడి దప్పి, గొల్లచేడెలఁగాళ్ళ వ్రేళ్ళఁబడి, వేఁడికూడి, జారుఁడని యాఱడిఁ బడుదువుగాక యని యాదిలక్ష్మి రామచంద్రమూర్తిని శపించెను. రాముఁడు ప్రతిశాపమిచ్చెను. “సరే కాని, యానాఁడు నీవుగూడ ఆదిలక్ష్మి కామేశ్వరి యను పేర వెలసి నామీఁది మోహమున నవయుచునే యుండెదవు పొమ్ము”అని. ఆదిలక్ష్మి శ్రీ మహావిష్ణువుతో విన్నవించుకొనఁగా “నేను శ్రీకృష్ణావతారమందెదను, నీవు శ్రీమహాదేవునకుఁ బుత్త్రివై వెలసి మద్విరహక్లేశము నందఁగలవు. నేను కల్క్యవతార మందినప్పుడు మరల నీవు నన్నుఁ బొందఁగలవు పొ"మ్మనియెను. శ్రీమహావిష్ణువు కృష్ణావతార మందెను. ఆదిలక్ష్మి మహాతపమున నున్న శివుఁజేరఁబోయి నన్నుఁ బుత్రినిఁగాఁ గాంచుకొన ననుగ్రహింపుమని వేఁడెను. శివుఁడు " నేనిప్పుడు మహాతపమున

నుంటిని. గౌరినింకను బెండ్లాడలేదు. అంతదాఁక నీ వీకొలన వసింపుము.

  1. కామేశ్వరి పాట 'స్త్రీల పాటలు' అను పేర ఏలూరు మంజువాణి ప్రెస్సులో ముద్రితములయిన మూఁడు సంపుటములలో నొకదానఁగలదు. కాని యదియధికదోషములతో నందదుకులుగా ననన్వితమై యసమగ్రమై యున్నది. ఆ భణితితోనే దానికిఁ బాఠాంతరముగూడఁ గలదు. అది సరిగా మరల ముద్రింపఁదగినది.