Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

క్రీడాభిరామము

మఱియు నింతకుముం దుదాహృత మయినపద్యము 'కలసి పెనంగు కాలమున' ఇత్యాదిక మీ పట్టున నుండవలసినది గాఁదగును. 'స్మరదివ్యాగమ’ 272 ప. తరువాతగూడ గ్రంథపాతము గలదు. ఇంతదాఁకఁ బేర్కొన్న గ్రంథపాతములందే యే విషయములు గలవో వానిపరిమితి యెంతో యెఱుగఁరాదు. 276 ప. - 280 ప. నడుమ గూడ గ్రంథపాతములు గలవు గాని వానిలోఁ బద్య గద్యభాగములు మాత్రమే లోపించినవి.

కథావస్తు విమర్శనము

ఓర్గంటివారగు మంచనశర్మ టిట్టిభసెట్టిగారల వృత్తమునుబట్టి వినుకొండకవి రచియించిన యీ వీథినాటకమును బల్లాళరాజుల రాజధాని యగు దోరసముద్రమున నుండి నటులు విచ్చేసి మోపూరి భైరవుని తిరునాళ్ళలోఁ బ్రదర్శించినట్లుగా నేతత్ గ్రంథనిర్మాణము గలదు.


క॥ నటులది దోరసముద్రము
     విటులది యోర్గల్లు కవిది వినుకొండమహా
     పుటభేదన మీత్రితయము
     నిట గూర్చెను బ్రహ్మ రసికు లెల్లను మెచ్చన్. (క్రీడా. 293వ)


కాసల్నాటి మాధవునికుమారుఁడును, మీసాలప్పయ్యగారి మేనల్లుఁడును నగు గోవిందమంచనశర్మ ఓరుఁగంటిలో ఆర్యవాటమునఁ గల కామమంజరి యను వునర్భువునకు ననుపుకాఁడై యుండెను. కార్యాంతర వ్యాసంగమున నాతఁడు కొంతకాలము దేశాంతరమున వసించి యక్కడ మిత్రుఁడయినటిట్టిభ సెట్టితోఁ గూడి తిరిగి యోరుఁగంటి కరుగుదెంచెను. మంచనశర్మకు వలసిన ధనాదివ్యయమును సంపన్నుఁడగుటిట్టభసెట్టిచేఁ బెట్టించుచుండెను. ఆ మిత్రులిర్వురును నొకనాఁటి వేఁకువజామున నేకశిలానగరమునఁ బ్రవేశించి యా నగరవీధులలోని వింతలు విశేషములు సూచుచు, వినోదించుచు రాత్రికి గంతవ్యస్థలమును జేరి యక్కడ కామోత్సవమునకుఁ గడఁగుట యిందలి కథావస్తువు.

ఇట్టి కథలో నేకశిలానగర వీథులలోఁ గన్పట్టుటనుబట్టి, ప్రసక్తానుప్రసక్తము లగుటనుబట్టి వివిధ విషయములు వర్ణితము లయ్యెను. వాని యనుక్రమణి విషయసూచిలోఁ గాననగును.