వేటూరి ప్రభాకరశాస్త్రి
57
వీనిఁబట్టి యది 'పిన్నయసోమ' భూపతిపేరఁ జెప్పఁబడినట్లు తెలియనగును. అతఁడారెవీటి బుక్కరాయల వంశమున పూర్వుఁడే యని తలఁపఁదగును. పై పద్యములిట్లు సోమభూపతిసంబోధనముతో నున్నను శ్రీధర చ్చందస్సులోనివిగా లక్షణగ్రంథములం దుదాహృతములగు పద్యములు పెక్కులు విష్ణుసంబోధనములతోఁగూడనున్నవి. ఇందేపద్యములు సరి యయినవో యెఱుఁగరాదు. ఆ గ్రంథము దొరకినప్పుడుగాని, దానిఁగూర్చి యిదమిత్థ మని నిర్ణయింపఁజాలము. శ్రీధరచ్ఛందము నేనుజూడలేదు. కనుకఁ జెప్పజాలను గాని, తక్కిన గ్రంథములందు క్రీడాభిరామపద్యములు వల్లభరాయని పేర నుదాహృతము లయ్యె ననుట కాధారము నాకుఁ గానరాలేదు. ఇప్పటికిఁ గ్రీడాభిరామము శ్రీనాథకృతము కాదనువారి సర్వవాదములకు శక్యమైనంతవఱకు సమాధానము చెప్పితిని.
ప్రేమాభిరామము
రావిపాటి త్రిపురాంతక కవీశ్వరుఁడు ప్రేమాభిరామ మను పేర సంస్కృతమున రచియించిన వీథీరూపకము ననుసరించి తెలుఁగున నీ క్రీడాభిరామము రచితమయ్యె నని యిందుఁ గలదు. ప్రేమాభిరామము నేఁడు గానరాదు. ఈ క్రీడాభిరామ మాప్రేమాభిరామచ్ఛాయ ననుసరించి రచింపఁ బడినదే కాని, దానికి సరి యయిన తెనుఁగు గాదు. ఓరుగంటిప్రాంతమున నున్నవాఁడు మఱింగంటి సింగరాచార్యుఁడు సీతాకళ్యాణ మనుగ్రంథమునఁ దాను ప్రేమాభిరామమును ద్విపదకావ్యముగా రచించినట్లు చెప్పుకొన్నాడు. ఆ కవిగ్రంథములు పెక్కులు దొరికినవి గాని ప్రేమాభిరామ ద్విపద దొరకలేదు.
గీ॥ "అనఘ! ప్రేమాభిరామ ధనాభిరామ
కావ్యములు జాతివార్తలు గడలుకొనగ
ద్విపదలుగఁ జేసితిని గడుఁ గృపను నెన్నఁ
బూని షోడశవత్సరములనె మొదల" - ( R.703)
- ↑ మా. రామకృష్ణకవిగారు దానిఁ బ్రకటించిరి.