వేటూరి ప్రభాకరశాస్త్రి
49
గాని యసాధారణముగా నుందురు. లౌకిక విషయసముల్లాసముతో నుండువారికి భోగవాంఛలు పొంగారుచుండును. అయినను సర్వసౌభాగ్యములు గల్గియుండియు నందందుఁ గొందఱు సువిరక్తులై, నిర్వికారులై, వీరవ్రతులై వెలయుచుందురు. సాధారణముగా ననేకులు స్వాంతము జజ్జువాఱుచున్నను లోకనిందకు వెఱచియు, సంఘమర్యాదకు జంకియు, నింకను బలుబాధలకు భయపడియు సద్వర్తనమును సాగించుకొనుచుందురు. అట్లువారు పవిత్రవర్తనమును బడయుటగూడ నిజముగా భగవదనుగ్రహాయత్తమే. సన్నివేశములు స్వాధీనములై దుష్ప్రవర్తనమునకుఁ ద్రోవలొసంగుచున్నను, జిత్తము చిదుకుచున్నను, జిత్రముగా నపాయములకందక పవిత్రవర్తనమునే పడయఁ గల్గుచుంట భగవదనుగ్రహాయత్తమే కాదా! రహస్యముగాఁ దమవర్తన మెంతేని క్రుళ్ళువాఱి దుర్గంధిలమై రోఁతగొల్పుచున్నను గొందఱు బాహిరముగాఁ బరిశుద్దులువోలె శిష్టతను నటించుచు శ్రీరంగనీతు లాడుచుందురు. లోనెల్ల నపవిత్రతతో నిండియుఁ బయికిఁ బరమ వేదాంతములు పలుకుచుఁ గాషాయములఁ దాల్చి సన్యాసివేషములతోఁ గొందఱు పయోముఖవిషకుంభములువోలె లోకమును మోసగించుచుందురు. తా రతి సచ్చరిత్రులయ్యును కొందఱు పయికి దుశ్చరిత్రులువోలెఁ దోఁచునట్లు ప్రవర్తించుచుందురు. తమ సచ్చరిత్రభంగమును జాటుసేయక సంతాపముతో వెల్లడించుకొనుచుఁ గొందఱు కుందుచుందురు. తమ తప్పిదములను దప్పిదములుఁగాఁ గూడఁ దలఁపక కొందఱు కొండాడుకొనుచుందురు. తప్పిదముల బలములు గూడఁ గాలభేదములబట్టి తార్మారగుచుండును. ఒక కాలమునఁ బ్రబలముగాఁ దలఁపఁబడు తప్పిదము కాలాంతరమున దుర్బలముగాను, ఒప్పిదముగాను గూడఁ దలఁపఁబడుటయుఁ గలదు. లోక మింత వింతతీరు గలది.
శ్రీనాథుఁడు సుఖదుఁఖములను, లాభనష్టములను, మానావమానములను దనకుఁ దటస్థించినవానిని జాటుసేయక చాటిచెప్పుకొను స్వభావము గలవాఁడు. తన గృహచ్ఛిద్రములను, దేశాటన క్లేశములను, దారిద్య్రమును, వానివలని యవమానములను నాతఁడు కలకాలము దెలియఁ దగునట్లు కవితలో వెలయఁ జెప్పుకొన్నాడు. నేలపన్ను నీయఁజాలకపోఁగా రాచవారు నగరివాకిట నిలఁబెట్టి భుజముపై నల్లగుండు మోపుటను, చేతులకు వెదురు గొడియ వేయుటను, కాళ్ళకు నిగళయుగళము దగిలించుటను, నెదురెండలో నూరివీథులఁ ద్రిప్పుటను అవమానములని యడఁచిపుచ్చక చాటిచెప్పుకొన్న జగజెట్టికి శ్రీనాథునకిఁకఁ దనవలచి వర్తించిన శృంగార వర్తనమును గూర్చియా సిగ్గుపాటు: అతఁడు దానినొక ప్రాభవవిశేషముగానే పరిగణించెను. అతఁడేకాదు; ఆతని నాదరించిన యా కాలపు మంత్రులుగూడ