Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

క్రీడాభిరామము


ఉ॥ దుప్పరివారశూన్యగతితో మెఱుఁగై సరసోచితోల్లస
      త్పుష్పశరాసన క్రియకుఁ బొల్పెసలారి మనోహరంబు నౌ
      పుష్పసుగంధ్యనంగగృహపుణ్యమునన్ భుజియింపఁగల్గెవా
      స్తోష్పతి కెన్ని యున్న సరితూఁగినవే యొక శోభనంబుతోన్.

క॥ ఆకదురునఁ బికరవమున్
     ఆకదురున భృంగరవము నాత్మరవంబున్
     ఏకీకృతముగ నేకు ల
     నేకులు విన వడికె ముదిర యేకులముదిరా!

ఉ॥ గుబ్బలగుమ్మ లేఁజిగురుఁగొమ్మ సువర్ణపుఁగీలుబొమ్మ బల్
      గబ్బిమిటారిచూపులది కాఁపుది దానికి నేల యొక్కనిం
      బెబ్బులి నంటగట్టితివి పెద్దవు ని న్ననరాదురోరి దా
      నబ్బ ! పయోజగర్భ! మగ నాలికి నింత విలాస మేటికిన్.

శా॥ దాయాదుల్వలె గుబ్బచన్ను లొఱయన్ ధావళ్యనేత్రాంబుజ
      చ్ఛాయల్ తాండవమాడఁ గేరి పురుషస్వాంతమ్మునన్ మన్మథుం
      డేయం జంగమువారి చంద్రముఖి విశ్వేశార్చనావేళలన్
      వాయించెం గిరిగిండ్లు బాహుకుశల వ్యాపారపారీణతన్.

ఉ॥ పువ్వులు కొప్పునం దుఱిమి ముందుగఁ గౌ నసియాడుచుండఁగా
      జెవ్వనఁ జంగసాఁచి యొకచేతను రోఁకలి పూని యొయ్యనన్
      నవ్వుముఖంబుతోడఁదననందనుఁ బాడుచు నాథుఁజూచుచున్
      సువ్వియసువ్వి యంచు నొకసుందరి బియ్యము దంచె ముంగిటన్.

సీ॥ బొమవింటఁ దొడిగిన పూవింటిదొరముల్కి
               పోలిఁ గస్తురిసోఁగబొట్టు దీర్చి
      చకచక లీను తారకలరేకులువోలెఁ
               గొలుకులు వెడలఁ గజ్జలము దీర్చి
      పొడుపుగుబ్బలిమీఁదఁ బొడమునీరెండ నా
               రంగుచందురకావిరైఁక దొడిగి
      పిఱుఁదుపొక్కిలి యనుమెఱకపల్లము గప్పఁ
               బాలవెల్లువవంటి చేల గట్టి

గీ॥ అంచకొదమలగమి బెదరించుపోల్కి
     నందెచప్పుళ్ళు ఘల్లుఘల్లనుచు మొఱయ
     నడుము జవజవలాడఁ గీల్జడ ఘటించి
     వచ్చె ముక్కంటిసేవకు మచ్చెకంటి