వేటూరి ప్రభాకరశాస్త్రి
31
గట్టనేర్తురు సీర గటిభరమునఁ
దొడువంగ నేర్తురు నిడు వ్రేలుఁజెవులందు
నవతంసకంబుగా నల్లి పువ్వు
పచరింప నేర్తురు పదియాఱువన్నియ
పసిఁడిపాదంబులఁ బట్టుచేల
గీ॥ పయ్యెదయు నిగ్గుఁ (సిగ్గుఁ) బాలిండ్లఁ బ్రాఁక నీరు
తఱచు పూయుదు రోలగందంబు పసుపు
బందికత్తెలు సురతప్రపంచవేళఁ
గంచియఱవత లసమాస్త్రుఖడ్గలతలు. (కాశీ. 3-109)
ఈ పద్యము కాశీఖండము తృతీయాశ్వాసమున నున్నది. శృంగార ప్రసక్తిలేనివాఁడు భగవదారాధనపరుఁడునగు శివశర్మ యను బ్రాహ్మణుఁడు తీర్థయాత్ర సల్పుచు కాంచీనగరము మీఁదుఁగాఁ బోవుట యక్కడి కథాసందర్భము. సంస్కృత కాశీఖండమున మీఁద నుదాహరింపఁబడిన పద్యమునకు మూలము లేదు. పై పద్యమునకుఁ బూర్వోత్తర పద్యములు మాత్రమే యక్కడ సరసములు సంగతములు మూలానుగుణములును; అట్టిచో నమూలక మయిన పై పద్యము నక్కడ శ్రీనాథుఁ డతకరించుట యనుచితము నసంగతమునుగ నున్నది. శ్రీనాథుఁడు కాంచీపురమున కరిగెను. అప్పుడాతఁడు చెప్పుకొన్న చాటుపద్యము విడిగానున్నఁ జెడిపోవునన్న లోభముచే నిందు దూర్చినాఁడనియే నేను దలంచుచున్నాఁడను. సంస్కృతమున లేనిదాని, కథాసందర్భమున కనుచితమైనదాని నీ పద్యమును శ్రీనాథుఁడు చెప్పుటకుఁ గారణమేమై యుండునో యించుక యోజించువారికి గోచరింపకపోదు.
మఱియుఁ గాశీఖండము సప్తమాశ్వాసమున దక్షాధ్వరధ్వంసకథలో.
సీ॥ శితికంఠునకును నెచ్చిలికాఁడు గాఁడొకో
యటమటీఁడైన యీ యక్షభర్త....
ఇత్యాది సీసపద్యము గీతిలో
గీ॥ ఏమి గుడువంగ వచ్చినా రిండ్లు విడిచి
హరుని వెలివెట్టినట్టి యీ యాగమునకుఁ
బంచవదనుని కను జేవురించె నేని
తత్‌క్షణమునంద తమయాండ్రత్రాళ్ళు దెగవె. (కాశీ. 7-60)