Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/491

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

456

శ్రీ మదాంధ్రవ్యాస భారత నవనీతము

వీరు రాజమహేంద్రవరశాస్త్రకళాశాలయందు దమయుద్యోగ ధర్మమును సక్రమముగా నిర్వహించుకొనుచు ననేక గ్రంథములను రచించి క్రమముగా నట్టి మహాగ్రంథము నింతవఱకునైనా విరచింపఁగలిగినందులకెల్ల ఱబ్బురపడి వారి నిర్మల కవితా ప్రవాహవేగ ధాటి నభినందింపవలసి యుండును గదా !

శ్రీ శాస్త్రులవారు తమ జీవితమునందుఁ గావించిన యాంధ్రభాషాసేవయుఁ గవితాపరిశ్రమమును వారు రచించి యుంచిన మహాభారత నవనీతము శైలియు నాంధ్రమహాజనులకు వెల్లడించి వారల సహాయసంపదలచే నీ మహాగ్రంథమును శిథిలమైపోకుండ ముద్రింపఁ జేయవలయునను తలంపుతో మచ్చునకీ మొదటి యాశ్వాసముమాత్ర మచ్చొత్తింపఁబడినది. అనంతరమహాకార్యభార మాంధ్రమహాజనుల యనుగ్రహముపై నాధారపడియున్నది.

ఈ గ్రంథభాగమును గ్రంథాలయమువారు కొనియు, విద్యాశాఖవారు పాఠ్యముగా గ్రహించియు శ్రీశాస్త్రులవారి కడమ గ్రంథమెల్లఁ బ్రకటితమగుటకుఁ దోడ్పడుదురు గాకని, శ్రీ శాస్త్రులవారి గ్రంథము శాశ్వతముగా వెలయుఁ గలదు గాకని, యాశించుచున్నాము.


వేటూరి ప్రభాకరశాస్త్రి

1944