శ్రీ దండక రామాయణము
కరణము అశ్వత్థరావు.
పండితాభిప్రాయము
సుప్రసిద్ధ విమర్శకాగ్రేసరులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు, తిరుపతి.
ఉద్దండ ధార గల “దండక రామాయణము"ను స్థాలీపులాక న్యాయమున చదివి చూచితిని. శ్రీ యనంతకృష్ణ శర్మగారు, అస్మద్గురువర్యులు వెంకటశాస్త్రిగారు వెల్లడించిన పరితోషమునకు బలే ! యని తోడు పలుకుట కంటె నే వెల్లడింపఁదగిన యభిప్రాయ భేదములేదు.
గ్రంథకర్తగారు రచనపు సొంపును, ఔచితిని జక్కగా ఎఱిగినవారు కాన కొఱఁత కానరాలేదు. మృదంగ ధ్వనికి విజ్జోడు గాకుండ భావానుకూలముగా నర్తకి యడుగుజాడ సాగినట్లు, దండక చ్ఛందముతో పదవిన్యాసము భావ ప్రసాదమునకు ననుగుణముగా ససిగా నీ గ్రంథమున సాగినది.
గ్రంథమెల్ల దండకముగా నుండుట యిది యొక క్రొత్తతీరు.
కవి కౌశలమును గొండాడుచు నీ దండకరామాయణమునకు సహృదయ లోకము స్వాగతము చెప్పగలదని తనియు చున్నాను.
తిరుపతి
(సం.) వే. ప్రభాకరశాస్త్రి
1949
(కావ్యం - శ్రీ దండక రామాయణము
కవి - కరణము అశ్వత్థరావు, కలుగోడు
ప్రచురణ - వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రి అండ్సన్స్ మద్రాసు
ప్రథమ ముద్రణ - జూన్, 1949)