Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/482

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాంచీ ఖండము

మల్లంపల్లి వీరేశ్వర శర్మ

పండితాభిప్రాయము

శ్రీ మల్లికార్జున శాస్త్రిగారి సంతానమునకు తేలికపాఱు పలుకు నాలిక కెక్కదు. పలుకు పొంకము, పరమార్థముతో శ్రుతిగూడి సాగును గాని పెడవాసి వెడత్రోవ తొక్కదు. ఇందుకు లక్ష్యముగా మీ గ్రంథమున దారుకావనవిహారకథ చదివితిని. శృంగారాభాసము దానఁ గానరాలేదు.

"పోతన భక్తీ" త్యాది పద్యము తాతగారిఁ గూర్చి చెప్పినదయినను, మనుమని యెడఁ గూడ ససిపడినది. తాతగారే మనుమఁ డయినా రేమో !

తపోమయులు, అస్మత్పూజ్య శ్రీ గురుపాదములు అద్దేపల్లి సోమనాథశాస్త్రిగారి పేరి పద్యము చదివి, మరలఁజదివి, కొంత తడవు తలఁపు లుడిఁగి, ముడిఁగి కూర్చున్నాను.

దోషజ్ఞతఁగాక గుణజ్ఞత నాకుఁ గూర్చినది మీ గ్రంథము. అయినను అచ్చుతీరు దానిని నాకు నిలిపినది.


తే॥గీ॥ మల్లికార్జున సుకవి కుమార వరుస
కుల్లసితకావ్యకళలు రంజిల్లు టరుదె?
గురులు తిరుపతి వేంకటేశ్వరుల కరుణ
మెలఁగు వారికిఁ దియఁబల్కుపొలుపు లరుదె?


తిరుపతి.

(సం) వే. ప్రభాకరశాస్త్రి


(కావ్యం - కాంచీఖండము

కవి - మల్లంపల్లి వీరేశ్వరశర్మ

ముద్రణ - శ్రీ రామలింగేశ్వర ముద్రాక్షరశాల వరంగల్ 1949)