మంగళగిరి మాహాత్మ్యము
నందిరాజు చలపతిరావు
పండితకవుల అభిప్రాయములు
ఆంధ్ర సారస్వత పరిషద్విచక్షణులచే “విమర్శకాగ్రేసర” బిరుదము బడసిన సుప్రసిద్ధ పండిత కవి విమర్శకులగు బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారిట్లు వ్రాయుచున్నారు.
ఆర్యా! వందనములు !
మీ గ్రంథమును సమగ్రముగా నవతరణికను ఎడనెడ గొన్ని కథాఘట్టములను జదివితిని. అస్మదాదులు కనులు దెరవక పూర్వమే మీరు తెలుగురచనలో గడుదిట్టలు. రచనాపటిమలో మీరు గండర గండండ్రు, మొనగాండ్రునగుట సువిదితము.
పండబారిన మీ కవితాఫలము “మంగళగిరి మాహాత్మ్యము” మంచి మంచి కథాఘట్టములు, తదనుగుణ కవితా వైశారద్యములు కలిగి హృద్యముగా నున్నది. రచనపు జిగిబిగువులు, పలుకు పొంకములు చక్కగా బొందుపడినవి.
పురాణ రచనమునకుఁబయి చేయియై “మంగళగిరి మాహాత్మ్య' రచన ప్రబంధరచన నందుకొనుచున్నది. ఎడనెడ మీ గ్రంథము చదువునపుడు పాండురంగ, కాళహస్తి మాహాత్మ్యములు స్మరణమునకు వచ్చినవి. అర్వాచీన సర్వక్షేత్ర మాహాత్మ్య రచనలకు నవిమేలు బంతులే కాన వానితో వంతుకు వచ్చుట క్వాచిత్కముగా అందందే అగును గదా! శ్రీనాథుడు కూడ మీ యట్టి వయసుననే కాబోలును కాశీఖండమును రచించినాడు. మీరింకను గ్రంథములు రచించుచుండగలరు గాక !
ఓరియంటల్ ఇన్‌స్టిట్యూట్
చిత్తగింపుడు
తిరుపతి
విమర్శకాగ్రేసర
1-10-47
వేటూరి ప్రభాకరశాస్త్రి
(మంగళగిరి మాహాత్మ్యము ( 7 ఆశ్వాసాల పద్యకావ్యం
కవి - నందిరాజు చలపతిరావు.
మంజువాణి ప్రెస్, ఏలూరు - (1948)