Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

413

కొకపద్యము చొప్పున సరాసరిగా సాగిన తెలిగింపు. ఇంక నిటీవల కొందఱెవరో కూడ దెలిగించినట్లు చూచినట్లు స్మరణలు. నాచూచిన రచనలలో శ్రీ రామకృష్ణయ్యగారి రచనమే చతురతరముగా నున్న దనగలను. ఇందుకు బ్రధానకారణము మూలచ్ఛాయానుసారిగా కవి కైకొన్న రచనాస్వాతంత్ర్యమనదగును.

రామకృష్ణకవిగారు తెల్గుకూర్పున జూపిన స్వాతంత్య్రపు నేర్పు నీ క్రింది శ్లోకపు దెలుగు సేతను బట్టి స్థాలీపులాక న్యాయముగ గుర్తింపనగును.


శ్లో॥ సా మే దృష్టి శ్శఫరనయనా సన్నత భ్రూస్సుకేశీ
     తన్వీ తుంగస్తనభరనతా తప్తజాంబూనదాభా
     బాలా యుష్మత్ప్రతిమగమనా వేదిమధ్యా పరాంగీ
     శృంగారాఖ్యం నిధిమధిగతా శ్రేయసీ దేవతేన.

సీ။ బేడిస కనుల పూబోడి నీ పోడిమి
               గమన విలాసములు గల నెలంత
     కాంత కుంతల పాశకలిత లావణ్యాబ్ది
               యాగవేది సమానావలగ్న
     పుటపాక శోధిత స్పుట సువర్ణ సవర్ణ
               సన్నత భ్రూలతా సాధువదన
     శృంగార నిధి నధిష్ఠించిన దేవత
               భాసురగాత్రి సౌభాగ్య లక్ష్మి

గీ॥ జనక భూజాని తనయ యక్షయ వివేక
     నిలయ వెలలేని కలిమి, నా యెలమి చెలిమి
     కలుష మెఱుగని రూపు నా కంటి చూపు
     అయ్యశోక వనీసీమ నరయు మయ్య !


పయి శ్లోకమున కీ తెలిగింపు లలిత లలితము జతురతరము మనోహరము నయియున్నది. నేను సరిపోల్చి చూచిన పట్లెల్ల నిట్లెయున్నవి.