Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

406

సప్తపదులు

సంతసించిరి. అపాయము తప్పుటకై గోపవృద్దులట్లే శ్రీకృష్ణుని ఘటకునిఁగాఁగోరి స్త్రీల నాయనకప్పగించి నోము నోమఁగోరిరి. గోపవృద్ధులు వెడలిపోయినతర్వాత శ్రీకృష్ణుఁడు గోపికలచే నారాధితుఁడై “యిండ్లకుఁబోయి ఈ రాత్రి నిద్రించి వేగుజామున వచ్చి నన్ను నిద్రలేపవలసిన"దని వారి ననిపెను. శ్రీకృష్ణుఁడు నావిరహము నోర్వఁజాలక నీలాదేవి సౌధమున కరిగెను. ఆ స్త్రీలును పరస్పరసంశ్లేషము తోనిండ్ల కేఁగి యట నిదురపట్టకపోగా శ్రీకృష్ణునిస్మరించుచు మిగిలిన గోపికలఁగూడ నిదురలేపుకొనివచ్చిరి. శ్రీకృష్ణుని దర్శించిరి...” ఇత్యాదిగా.

కాని యీ 'పెరియవాచ్చాంబిళ్లై' చెప్పిన పై కథార్థమున కాధారమేదో కానరాదని మూ. రాఘవయ్యంగారు ప్రసిద్ధ ద్రవిడ విద్వాంసులు 'తిరుప్పావై' ని గూర్చి ద్రవిడమున వ్రాసిన యొకవ్యాసమున వ్రాసిరి. అందు వారు మఱియు గొన్ని విషయములఁ దెలిపినారు. శ్రీభాగవతము సప్తమ స్కంధమున హేమంతర్తువులో గోపికలు కాత్యాయనీవ్రతమును చేయఁబూనినట్టును, తొలినాఁడు వారు నదీస్నానమునకుఁబోయి వలువలు దరినుంచి నీరాడుచుండఁగా శ్రీకృష్ణుడు వానిని హరించినట్టును గోపికావస్త్రాపహరణ కథాఘట్టమునఁ గానవచ్చుచున్నది. ఈ తిరుప్పావై గ్రంథమునఁ జెప్పఁబడిన నోమా కాత్యాయనీవ్రతము కావచ్చునని వారనిరి. తిరుప్పావై పాశురములలో మకుటముగా గానవచ్చు "ఏలో రెంబావాయ్" అనుపదము బొమ్మ రూపుననున్న స్త్రీ దేవతను జెప్పుచున్నదని వారు నిరూపించిరి. వైష్ణవులకు శ్రీకృష్ణైక శరణ్యత బలసిన తర్వాత కాత్యాయనీ వ్రతప్రస్తావము జాఱవిడువఁబడి యుండవచ్చును. కావుననే 'పెరియవాచ్చాంబిళ్లె' ప్రభృతులు దాని బేర్కొనరయిరి. ఆ వ్రతము విష్ణు విషయకము, కాదనియు, శక్తి విషయకమే యనియు నిరూపించుట కింకొక యాధారమును వారు చూపిరి. వైష్ణవులకు వేదకల్పమగు నాలాయిరమున 'దిరుప్పావై' యున్నట్టు ద్రవిడ దేశమున శైవలకును వేదకల్పమగు తిరువాచకమున (మాణిక్యవాచకర్ రచించినది) తిరువెంబావై యని యొకలఘు గ్రంథమున్నది. అదియుఁ బరమశివునిఁ బడయుటకై ధనుర్మాసమునఁ జేయువ్రతము రీతిని దెలుపుచున్నది. శైవులును వైష్ణవులవలె ధనుర్మాసమున వేకువజాముననే నిద్రలేచి దాని ననుసంధానము చేయుదురట ! "మార్గళి