సప్తపదులు - పీఠిక
(తిరుప్పావై యను ద్రవిడప్రబంధమునకు తెలుగుపాటలు)
ద్రవిడవైష్ణవులు వేదకల్పముగా నధ్యయనముచేయు నాలాయిరంలోనీ “తిరుప్పావై” యను ముప్పది పాశురముల గ్రంథమున్నది. ఇది ద్రవిడదేశమందేకాక యాంధ్రదేశమందునుగూడ వైష్ణవులకు వాచో విధేయమై యుండును. అనుదినమును గీతోపనిషత్కల్పముగా దీనిని వారనుసంధానము చేయుచుందురు. అందును ధను (మార్గళి) ర్మాసమున నతిప్రధానముగాఁ జేయుదురు. విష్ణ్వాలయములందునుగూడ ధనుర్మాసమున దినమున కొక పాశురము (సీసపద్యమువంటి పద్యము) చొప్పున ముప్పది దినములు ముప్పదిపాశురములను దెలతెలవాఱకముందె యనుసంధించి స్వామి యారాధనము కావింతురు. చక్కెర పొంగళ్ళు, దధ్యోదనములు నారగింపులు పెట్టుదురు. పెరియాళ్వారని, పేరొందిన విష్ణుచిత్తుల పుత్రియగు నాండాళ్, (గోదా) దేవి ఈ కృతికి గర్త్రి. ఈమె చరిత్రము ప్రఖ్యాతాంధ్ర ప్రబంధమగు నాముక్తమాల్యదలో గొంతచూడఁదగును. ఆమె శ్రీరంగనాధస్వామినే వివాహమాడినదఁట! భగవద్గుణానుభవానంద పరవశయై యామె తన భర్త శ్రీరంగనాథస్వామియేయని వినోదించుచు లౌకికరీతిచే నవివాహితగానే యాయుష్కాలము గడపియుండవచ్చును.
గ్రంథార్ధము
ఈ గ్రంథమునకు ద్రవిడభాషలోఁ బెక్కు వ్యాఖ్యానములున్నవి. “పెరియవాచ్చాం బిళై” యను వ్యాఖ్యాత యిట్లు చెప్పినాడు. సర్వేశ్వరుఁడు లోకమునుద్ధరించుటకై గోకులమున శ్రీకృష్ణుఁడై యవతరించి పంచలక్షకుటుంబముల నున్న గోపస్త్రీలను సౌందర్యగుణకర్మములచేత వశపఱచుకొని ప్రాప్తయౌవనుఁడై యానందమునఁ దేలుచుండెను. అట్లు యౌవనవిలాసముల నందుచున్న యువతులను శ్రీకృష్ణునిఁజూచి గోపవృద్ధులందఱునుగూడి "ధూర్తుఁడగు శ్రీకృష్ణుని కడకు స్త్రీలుపోఁగూడ"దని ప్రతిషేధించి వారి నిండ్లలో నడఁచి పట్టిరి. వారుచేసిన ఈ కృత్యము వల్ల వర్షములేదయ్యెను. అపుడు 'గోధనులగు గోపకులీయెద్దడికిఁ దాళఁజాలక వర్షార్థమై వ్రతమాచరింపను మనల నియోగింతురు. శ్రీకృష్ణుఁడు ఘటకుఁడు కాఁగలఁ'డని గోపకాంతలు