404
ఆంధ్రకామందకము
పరిశ్రమమున నవీన ముద్రణపు లిపిరీతి చొప్పున ఛందోగణయతిభ్రంశ రహితముగా వేఱొక ప్రతి వ్రాయింపవలసె. ఎట్లో ప్రతి వ్రాయించి సందిగ్ధస్థలములను తంజావూరికిఁ బోయి మాతృకతో సరిచూసి దిద్ది యింకను దిద్దఁ గుదురని స్థలములను సంస్కృతమూలమునుజూచి పూరించియును, అందును గుదురనిదాని నుచితరీతిని క్రొత్తగా రచనముచేసియును గ్రంథమును బూరించితిని. తంజావూరి నుండి పుస్తకము నాకు వచ్చినదాదిగా నిట్లు ముద్రిత మగు నంతదాఁక జరిగిన నిర్వాహములో నాకు గుడిభుజమై నాసహోద్యోగి విద్వాన్ సాహిత్యశిరోమణి, చిరంజీవి పంగనామాల బాలకృష్ణమూర్తి ఎమ్.ఏ.బి.ఒ.యల్. కడచిన వేసంగి సెలవులలో నాకెంతేని తోడ్పడెను. తంజావూరి సరస్వతీమహల్ పుస్తకాలయ కార్యదర్శి శ్రీ యస్ గోపాలన్ బి.ఏ. బి.యల్. గారును, నీ ముద్రణమును తిరుపతి రత్నాప్రెస్‌లోనే సాగించుటచే నా ప్రెస్‌వారును మాకుఁజాలఁగా ననుకూలించి యెంతేని తోడ్పడిరి. పైవారికి నేనెంతయుఁ గృతజ్ఞుఁడను.
ఈ కామందకకృతి యాంధ్రులయాదరము పడయఁ గలదని, తంజావూరి సరస్వతీమహల్ లైబ్రరీలోని యముద్రితాంధ్ర గ్రంథము లెల్ల సుముద్రితములై వెలయఁగల వని యాశించుచున్నాను.
తిరుపతి
1-8-50
వేటూరి ప్రభాకరశాస్త్రి.
(ఆంధ్రకామందకము
ఉపోద్ఘాతము
మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక బాండాగారము
1950)