400
ఆంధ్రకామందకము
ఆంధ్రకామందకము నీతిసారము - గ్రంథరచనము
ఇది ప్రాచీనకామందకమంత రసవంతము కాదేమో కాని, శబ్దశుద్ధియు విషయ వైశద్యమును, ఉత్తమరచనము మున్నగు సుగుణములతో నొప్పుచున్నది. ఇందాంధ్ర దేశపు రాజనీతి సంప్రదాయములు కొన్నిగలవు. ఆంధ్రదేశపు రాజనీతి పరిభాషాపదములు కొన్ని యచ్చటచటఁ గలవు. రాజనీతిశాస్త్ర పరిశోధకులు వానినెల్ల నుద్ధరింపవచ్చును. రాజ్యములే పోవుచున్న యీ కాలములో నీ రాజనీతిగ్రంథములు చరిత్రకారులు శాస్త్ర నిర్మాణక్రమాదిచరిత్ర పరిశీలనమునకేగాని రాజ్యాంగ ప్రయోజనమున కుపకరింపవు. కాని, లోకవ్యవహారజ్ఞానము వీని వలన విశేషముగా లభింపఁగలదు.
కృతికర్త - గ్రంథరచనా కాలము
మ॥ రమణీయంబుగ శాలివాహశకవర్షంబుల్ గతంబై సహ
స్రము నేనూఱును నాఱునై వెలయఁగాఁ బ్రౌఢిం దెనింగించి రౌ
ర మహిం దిమ్మయవేంకటాద్రివిభుపేరన్ వేడ్కఁగామందకీ
యము శ్రీ వేంకటరామకృష్ణులు స్వభాన్వబ్దంబునన్ రూఢిఁగా॥
అను నాశ్వాసాంత పద్యమునుబట్టి యిది రామకృష్ణ కవులచే రచితమని తెలియుచున్నది. కొందఱీ గ్రంథము రామకృష్ణ కవులనుజంటకవులచే రచితమని యందురు గాని యందు కాధారము కానరాదు. ఆశ్వాసాంత
గద్యమునఁ బట్టి యది యొక్కని పేరే యని తెలియనగును. పై పద్యమున బహువచన ముండుట పూజార్ధము కావచ్చును.
కృతిపతి
ఈ కామందకకృతి నందికొనినది కొండ్రాజు వెంకటాద్రిరాజు. ఈతఁడారవీటి వంశస్థుఁడగు కొండ్రాజు తిమ్మరాజకుమారుడు. తెనాలి రామకృష్ణుని పాండురంగమాహాత్మ్యమునకుఁ గృతిపతియగు విరూరి వేదాద్రి మంత్రికి యజమానియగు పెద సంగభూపాలునకుఁ జెల్లెలి కుమారుఁడు.
ఈ వెంకటాద్రి రెట్టమత మనెడిజ్యోతిష గ్రంథమునుగూడ నంకితమందినాఁడు.