Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/431

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

396

ఆంధ్రకామందకము

ఈ గ్రంథ మనుష్టుప్‌శ్లోకాత్మకమైనదైనను వ్యాఖ్యానిరపేక్షముగా నర్థముకానిది. దీనికి జయమంగళ యనియు, మఱొకటియు వ్యాఖ్యలు గలవు. తిరువాన్కూరు ముద్రణాలయమువారు ప్రకటించిన జయమంగళా వ్యాఖ్యానముతోడి ముద్రణమే యున్న వానిలోఁ బ్రశస్తమైనది. ఇప్పటికి 100 ఏండ్లకు ముందు తడకమళ్ళ వెంకటకృష్ణారాయలను గొప్పవిద్వాంసులు ఈ కామందకమునుఁ దెనుఁగు టీకతోఁ దెనుఁగు లిపిలో ముద్రించిరి. తిరువాన్కూరు ముద్రణమునకును దీనికిని గొన్నిభేదము లున్నవి. కృష్ణారావుగారి తెలుఁగుటీక ప్రశస్తమైనది. వారీపద్యకామందకము నెఱుఁగరు.

అంధ్రకామందకము - రాజనీతిగ్రంథములు

ఈ కామందకమును క్రీ॥శ॥ 1400 పూర్వకాలముననే యెవ్వరో పద్యకావ్యముగాఁ దెనిఁగించిరి. అందలి పద్యములు పెక్కులు మడికి సింగన సకలనీతి సమ్మతమున నుదాహృతములై యున్నవి. సకలనీతి సమ్మతమున మడికిసింగన యీ క్రిందివాని నాంధ్రరాజనీతిగ్రంథములను బేర్కొనినాఁడు. అవి ముద్రామాత్య, పంచతంత్రీ, బద్దెభూపాల, చాణక్య, ధౌమ్య, విదుర, ధృతరాష్ట్ర, బలభద్ర, కామందక, గజాంకుశ, నీతిసార, నీతిభూషణ, క్షేమేంద్ర, భోజరాజ, విభూషణ, పురుషార్థసార, భారత, రామాయణాది మహాకావ్యంబులు పురాణేతిహాసములు కందనామాత్యు నీతితారావళి లోకోక్తి చాటుప్రబంధంబులును. వీనిలోఁ బెక్కుగ్రంథములు నష్టములైనవి. సింగన ఆయాగ్రంథములలోని పద్యములను బెక్కింటిని తన గ్రంథమున నుదాహరించికొనినాఁడు. అందు బద్దెన నీతి యొకటి మాత్రమే యిపుడు లభించుచున్నది. సకలనీతిసమ్మత మును బోలె శ్రీరామకృష్ణకవిగారే తొలుత నీ బద్దెననీతిం బ్రకటించిరి. సకలనీతి సమ్మతమున నుదాహరింపఁబడిన ప్రాచీన కామందక పద్యములు కొన్ని యిచటఁ జూపుచున్నాఁడను.


ఉ. స్నానవిలేపనాభరణచారుసముజ్జ్వలగాత్రుఁడై శుభ
    స్నానము నాత్మదత్తవసనస్ఫుటమూర్తియు నైన దేవులన్
    స్థానము సేర్చి వారి సదనంబుల కేఁగక చేయుచు న్నిజా
    ధీనమనస్కుఁడై సతులతీపులు నమ్మకయున్కి యొప్పగున్.


(సకలనీతి సమ్మతము. పద్యము 286: ఆంధ్రకామందకము: ఆ. 3ప.138)