వేటూరి ప్రభాకరశాస్త్రి
395
పదవశతాబ్దమువాఁడగు భోజుఁడును అర్థశాస్త్రమునఁ గృషిసల్పినట్లతని నీతిభూషణమను గ్రంథము తెల్పుచున్నది. అందర్థశాస్త్ర విషయమునంతను 1. వినయ 2. వార్తా 3. వ్యవహార 4. రక్షా 5. మంత్ర 6. ఉపాయ 7. విక్రమ 8. యుద్ధ 9. ఉపనిషత్ 10. ప్రశమస్కంధములని పది విభాగములుగా రచించె నని తెలియుచున్నది. కాని యా గ్రంథము లభ్యం మగుటలేదు.[1]
కామందక నీతిసారము
పైవిధముగఁ బరిశీలితములైన ప్రాచీన రాజనీతిమూలగ్రంథములకు దరువాతఁ గౌటిలీయార్థశాస్త్రమునకు సంగ్రహకారికా రూపమైన కామందక నీతిసారము సంస్కృతమున వెలసినది. ఇది క్రీ॥శ॥ 4-వ శతాబ్దమునకు
బూర్వముదియు 1-వ శతాబ్దమునకుఁ దర్వాతిదియు నని చరిత్రకారులు గుర్తించిరి. ఏతత్కర్త కామందకుఁడు. ఆతని చరిత్ర మేమియుఁ దెలియరాదు. ఈ కామందకము 36 ప్రకరణములు గలది. కౌటిలీయార్థశాస్త్రము ననుసరించియే యిది రచితమైనను నిందుఁ గౌటిలీయమున గల విషయములు గొన్ని గానరావు. కౌటిలీయమున లేని విషయములు నిందుఁ గొన్ని గలవు. ఈ విషయమున 'రాజపుత్రుని విద్యాభ్యాసపద్ధతిని నిర్ణయించు సందర్భములో నతఁడు (కౌటిల్యుఁడు) 'అధ్యక్షులనుండి వార్తను, వక్తృప్రయోక్తల నుండి దండనీతిని నేర్చుకొనవలె' నని చెప్పియున్నాఁడు. ఇతనికి నితర గ్రంథకర్తలకుఁ గల భేదమిదియే. కామందకాదు లిట్టి వ్యవహారానుభవము గలిగినవారు కారు. ఇతరులు వ్రాసిన గ్రంథముల వివేకదృష్టితో విమర్శించి స్వాభిప్రాయములఁ గొన్నిటిని జేర్చి కామందకుఁడు లోనగువారు నీతిశాస్త్రముల రచించిరి. కనుకనే వారి పుస్తకములందు సందర్భానుచితములగు ప్రశంసలుకూడ నక్కడక్కడఁ గన్పడుచుండును. కౌటిల్యుఁ డట్లుగాక సందర్భోచితముగను వ్యవహారానుకూలముగను వ్రాసియున్నాఁడు.”[2]