Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

385

వ్యవహార భాషలలో వ్రాసికొనియుందురు. ఈ గ్రంథమున కృష్ణమాచార్యుడు "ఈ లక్షణాలను కందాళ వెంకటాచార్యులుగారు చెప్పిన పద్యాలు" అని కొన్ని పద్యాలు చేర్చిరి. అతడు కృష్ణమాచార్యునికంటెఁ దర్వాతివాడు.

నేను కృతిప్రేరకుని వంశము వారగు రాచూరి జమీందారుగారికి జాబులు వ్రాసి ముద్రణోపక్రమము తర్వాత నొకవ్రాఁత ప్రతిని వారివల్ల బడసితిని. కాళహస్తి వ్రాఁత గ్రంథములలో నొకప్రతి తిరుపతి దేవస్థాన పుస్తకశాలకు లభించినది. ఈ రెంటి సహాయములేకున్నచో నేతద్గ్రంథ ముద్రణ మీతీరుననేని నెఱవేఱక పోయెడిదే.

రాచూరు జమీందారు గారగు శ్రీ కృష్ణానేని హయగ్రీవరావుగారు వారి వ్రాఁతప్రతి నొసగియు, తమవంశ చరిత్రాది సాధనములను తమ యుద్యోగి శ్రీ కోపల్లె రామకృష్ణారావుగారి ద్వారమున పంపియు, శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు తమదగ్గరనున్న ధనుశ్శాస్త్ర గ్రంథముల నీ పీఠికా రచనకాలమున నొసగియు, ప్రతిదినము ఉదయము వచ్చిన ప్రూపులను నాఁడే వానిని మద్రాసు పంపుటలో నాకు చిరంజీవి పంగనామముల బాలకృష్ణమూర్తి బి.ఓ.యల్ (ఆనర్సు) నా సహాయోద్యోగి చాలదోడ్పడియు, విద్యాజన్మ వంశములందు సంతానమగు చిరంజీవులు శ్రీనివాస, సచ్చిదానందులు, సుందరమూర్త్యానందమూర్తులు నన్ననువర్తించి యువకరించిరి.


విరోధి

మాఘపూర్ణిమ

వేటూరి ప్రభాకరశాస్త్రి.

( పీఠిక

ధనుర్విద్యావిలాసము

ప్రభుత్వ ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారము

మదరాసు

ప్రచురణ 1950)