Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

7

లుదాహరించిన పద్యములు క్రీడాభిరామమున నానుపూర్వితో నున్నవి. ప్రక్షిప్తములనఁ గుదురదు. వల్లభరాయుఁడును శ్రీనాథుఁడును సమకాలమువారు గాకపోవుదురేని, శ్రీనాథుఁ డాతనిపేర గ్రంథము రచించుట యసంభవమగును. అట్టి చిక్కులేదు. శ్రీనాథుఁడును వల్లభరాయఁడును సమకాలమువారు. వల్లభరాయని పెద్దతండ్రియగు లింగనమంత్రి విద్యానగరపు హరిహరరాయల మంత్రి. రెండవ మూఁడవ హరిహరరాయండ్రు క్రీ.శ. 1402 - 1412 వఱకు నుండిరి. లింగనమంత్రి వారిలో నెవరియొద్ద మంత్రియయి యుండినను వల్లభరాయఁడు మన శ్రీనాథుని సమకాలమువాఁడే యగును. అందును నీ క్రీడాభిరామమును కాశీఖండ రచనానంతరమే రచించెనని నేఁదలంచుచున్నాఁడను గాన శ్రీనాథుఁడును వల్లభరాయఁడును సమకాలమువారగుదురనుటను సంశయింపఁ బనిలేదు.

మఱియు నీ గ్రంథమున వల్లభరాయని వాగ్వైభవ దాతృత్వాది వర్ణనము మితిమీఱి యున్నది. గ్రంథకర్తయే తా నగుచో వల్లభరాయఁడట్లా కందపద్యాష్టకమును రచించుకొని యుండఁడు. ఆ పద్యములు భీమఖండాదులలోని కృత్యవతరణికాపద్యముల ( భీమ. 1.36; 71) పోలిక గలిగి యున్నవి. అందుఁ గడపటి పద్యము.


క॥ ఉపమించెద ధారాధర
     తపనజ రైరాజ రాజ ధారానగరా
     ధిప ధారాధరవాహులఁ
     ద్రిపురాంతకవల్లభుని వితీర్ణి ప్రౌఢిన్.
                                                     ( క్రీడా. 29ప. )


అని యున్నది. మఱియుఁ గృత్యవసాన పద్యమునఁ గాలభైరవుఁడు కవీంద్ర కాంక్షితత్రిదశమహీరుహమగు వల్లభరాయనికి సమగ్ర వైభవాభ్యుదయములు కృపసేయునని యాశీర్వచనమున్నది. సూత్రధారోక్తిగాను భరతోక్తిగాను నయినను గ్రంథకర్తయగువాఁడిట్లు చెప్పుకొనుట సరసముగాదు. ఇది తానే తుమ్ముకొని, తానే శతాయుస్సని యనుకొన్నట్టున్నది. కవీంద్రకాంక్షిత త్రిదశమహీరుహము గావున, వల్లభరాయఁడు విశేష ధన మొసఁగి కవియశః కాంక్షియై యేతత్కృతికర్తృత్వమును దనపై వేయించుకొన్నాఁడని తలచుట ప్రమాణదూరముగాదు. అట్టి సంప్రదాయముగూడ నా కాలమున హెచ్చుగాఁ గలదు.