Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

330

అన్నమాచార్యచరిత్ర


కొనియాడినా నిన్నే కాని గుంపించినా నిన్నే కాని ।
పనివినా నిన్నే పాడినా నిన్నే కాని ।
మనసిచ్చి యలమేలుమంగపతి వేంకటేశ ।
యెససితివి మాచెలి నింక నేచ నేమిటకయ్యా ॥కట॥ 3


ఆళ్వార్లు - అన్నమాచార్యుఁడు

ద్రవిడవేదాంత రచనమునకై శఠకోపయతీంద్రు లవతరించిన విధముగా నంధ్రవేదాంతరచనమునకై యన్నమాచార్యుఁ డవతరించినాఁడు.

శఠకోపయతి వైశాఖమాసమున విశాఖానక్షత్రమున నవతరింపగా- నన్నమాచార్యుఁడును వైశాఖమాసమున విశాఖనక్షత్రమున నవతరించినాఁడు. శఠకోపయతి పదునాఱేండ్ల వయసువాఁడయిన తర్వాత సర్వవిద్యలు గోచరించి ద్రవిడ సంకీర్తనములు రచింప దైవానుగ్రహమందఁగా నన్నమాచార్యుఁడు నట్లే పదునాఱవయేటఁ స్వామి ప్రత్యక్షమై యుద్బోధింపఁగా సంకీర్తన రచనము సాగించెను. శరకోపయతి శ్రీ తిరువేంగడనాథుని మీదను నింకననేక దివ్యస్థలములలోని విష్ణుమూర్తులమీఁదను సంకీర్తనములు రచింపఁగా నన్నమాచార్యుఁడును ప్రధానముగా శ్రీ వేంకటనాథునిమీఁదను నింకను ననేకపుణ్యస్థలముల విష్ణుమూర్తులమీఁదను సంకీర్తనలు రచించెను. శఠకోపయతిస్వామి కౌస్తుభాంశమున జన్మించినట్లు విజ్ఞులు విశ్వసింపఁగా నన్నమాచార్యుఁడు స్వామినందకాంశమున నవతరించినట్లు ప్రాజ్ఞులు పరిగణించిరి.

పెరియాళ్వార్లు (విష్ణుచిత్తులు) తులసీవనమున జనించిన గోదాదేవిని రంగనాథస్వామి కొసఁగి పెండ్లిచేసి మామగా రయినట్లే యన్నమాచార్యులు గూడఁ బద్మసరోవరమున జన్మించినమంగాంబికను వెంకటేశ్వరస్వామికిచ్చి పెండ్లిచేసి మామగా రయ్యెను.

ఇట్టి మహత్త్వముగలవాఁడు గనుకనే తిరుపతి వేంకటేశ్వరస్వామిసన్నిధి నీతనికి, నీతనివంశమునకుఁ గూడ నానాఁ డఖండగౌరవ మలవడినది.