Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

309

నామలింగానుశాసనమునకుఁ దెలుఁగువ్యాఖ్య రచించినాఁడు. కావ్యప్రకాశికకు వ్యాఖ్య రచించినాఁడు. క్రీ. 1554లో అంబత్తూరు తూప్పిల్ అగ్రహారములలో కొంతభాగము తిరుపతి గోవిందరాజస్వామి పెండ్లి తిరునాళ్ళు జరపించుటకుగా సమర్పించినాఁడు. క్రీ. 1553లో చిన కంచిలో అరులాళప్పెరుమాళ్ళకు వల్లాత్తం జేరి పేరీచ్చంబాకము అను గ్రామము లిచ్చినాఁడు. [1]

తిరుపతి శాసనములు

తిరుపతి దేవస్థానశాసనము లెల్ల నరవముననే కలవు. సర్వస్వతంత్రుఁడు దక్షిణాపథమునకెల్ల సార్వభౌముఁడును గాన యొక్క శ్రీకృష్ణదేవరాయఁడు మాత్రము గుడిలో సంస్కృత కర్ణాటాంధ్ర ద్రవిడములలోఁ దనశాసనములఁ జెక్కించుకోఁ గలిగెను. తిరుమల తిరుపతి దేవస్థానముల గుడిగోపురములలో దాళ్ళపాక వారి శాసనములు నరవముననే యున్నవి. తిరుమల కొండక్రిందనే తాళ్ళపాక వారి యగ్రహారముగానున్న మంగాపురమునఁ దాళ్ళపాక చినతిరుమలాచార్యుఁడు తాను గట్టించిన కళ్యాణవెంకటేశ్వర దేవాలయమున శాసనము లన్నింటిని తెలుఁగుభాషలోఁ దెలుఁగులిపిలోనే చెక్కించుకొనెను. శుద్ధాంధ్రు లయిన మహనీయులు సాళువ తిమ్మన, గోవిందన, బయకారరామయ మొదలగువారు శ్రీస్వామి వారి కర్పించిన యగ్రహారాదులు శాసనములుగూడ ద్రవిడముననే ద్రావిడీకరణముఁబడసిన పేర్లతోనే యున్నవి. శాసనము లెల్ల ద్రావిడముననే యుండుటకుఁ గారణము దేవస్థాన స్థానపతులు ద్రవిడు లగుటయే. గుడిలో శాసనములఁ జెక్కించుట కధికారులు వారే. తిరుమలాచార్యాదులు పదులకొలఁది గ్రామములను స్వామికి సమర్పించు కొన్నారేకాని గుడిలో శాసనములఁ జెక్కించుకోలేదు. ఆయా దాతలిచ్చిన యీవులను బ్రతిగృహీత యగుదేవునికిఁ జెల్లింతుమని దేవస్థాన స్థానపతులు బాధ్యత వహించి యుభయులకు నమ్మికగా శాసనములఁ జెక్కించిరి. దానికి 'శ్రీవైష్ణవరక్ష' వెట్టిరి. తిరుమలాచార్యులనాఁడు శాసనములఁ జెక్కించినయుద్యోగి తిరునిన్రార్‌వు‌డయన్ . స్వామిపుష్కరిణి కడ మాత్రము పెద తిరుమలాచార్యుఁ డొక తెలుఁగుశాసనము వేయించు

  1. పై చరిత్ర విషయములు పెక్కులు శ్రీసాధుసుబ్రహ్మణ్యశాస్త్రులుగారు రచించిన శాసనముల రిపోర్టులోని విషయములు శాసనములు చదివి సమకూర్చినవి.