Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

305

గోవిందరాజ విట్టలేశ్వరాచ్యుతపెరుమాళ్ రఘునాథ వరదరాజ లక్ష్మీనారాయణులకును హనుమదాలయములోఁ దాను ప్రతిష్ఠించిన నరసింహస్వామికిని కైంకర్యములకై చిత్రిచిత్రానక్షత్రమునఁ దన తిరునాళ్ళలో వైశాఖమృగశిరను దనతండ్రి తిరునాళ్ళలో గోవిందరాజస్వామి గుడిదగ్గఱి సుదర్శన చక్రమునకుఁ గైంకర్యములకై 200 రేఖై పొన్నుల రాబడిగల వెదుమప్పాకం గ్రామము నర్పించినాఁడు.

మంగాపురమున కళ్యాణవేంకటేశ్వర దేవాలయ జీర్ణోద్ధారణము గావించినాఁడు. స్వామి దివ్యసుందరమంగళ విగ్రహమునుగూడ నీతఁడే క్రొత్త వెలయింపించినట్టున్నాఁడు. ఆళ్వార్లతో భాష్యకార్లతో దేశికులతో సహ తనతాతగారగు అన్నమాచార్యు విగ్రహము నక్కడ ప్రతిష్ఠించినాఁడు. కాని, యావిగ్రహము నేఁడు గానరాకున్నది.

పెదతిరువెంగళనాథుఁడు

ఈతఁడు సాత్త్వికశుభమూర్తి సంగీతసత్కవిత్వాధికుఁడు నని చిన్నన్నచే స్తుతింపఁబడెను. స్వామిసన్నిధి నీతఁడు సంకీర్తనములు పాడుచుండగా స్వామి యాడుచుండెడువాఁడట ! వెంకటాచార్యుఁడు "విశేషించియు నత్తిరు వెంగళనాథుండు సంకీర్తనంబుఁబాడిన నాడందొడంగె,"[1] నని చెప్పినాఁడు. ఈతడు చిన్నన్న జీవించియుండఁగా క్రీ 1546 పూర్వమే దివ్యధామ మందినాఁడు.

చిన్నన్న

ఈతఁడే అన్నమాచార్య చరిత్రకర్త. చినతిరుమలాచార్యున కీతఁడు మూఁడవతమ్ముఁడు. ఈయిర్వురనడుమ అన్నమయ యని పెదతిరువెంగళనాధుఁ డనీ యిద్దరు సోదరులు. చిన్నన్నతర్వాత తమ్ముఁడు కోనేరునాథుఁడు

వీరందఱును సుప్రసిద్ధులు. కోనేరునాథుఁడు 1560 తర్వాతఁ గూడనున్నాఁడు. తాళికోటయుద్ధమును, విద్యానగర వినాశనమును, జూచుదౌర్భాగ్య మునకుఁ బాల్పడక 1565 పూర్వమే వీరందఱు దివ్యధామ మందియుందురు.

  1. శకుంతలా పరిణయకృత్యవతరణిక.