300
అన్నమాచార్యచరిత్ర
అచ్యుతరాయలవారు పూండి, సంగమకోటగ్రామములఁ దామ్రశాసన పూర్వకముగా దానము చేయఁగాఁ బెదతిరుమలాచార్యుఁడు వానిని స్వామికే సమర్పించెను. ఆతఁ డచ్యుతరాయలు జన్మనక్షత్రము నాఁడు తనద్రవ్యముతో స్వామికిఁ గైంకర్యములఁ గల్పించెను. అచ్యుతరాయలనాఁడాతఁడు విజయ నగరములో విట్ఠలేశ్వరస్వామికైంకర్యములకై గొప్ప భూసమర్పణము చేసెను. పెదతిరుమలయ్య స్వామికి అర్పించిన గ్రామములు :- కావనూరు, మరువాకరై, కుప్పము, కీళంగున్రము, మన్నసముద్రము, పూండి, సంగమకోట, ( ఈ రెండూళ్ళ సంవత్సరపు రాబడి 1000 రేఖ పొన్నులు) రాయలపాడు, సోమయాజులపల్లి, కత్తమువారిపల్లి, ఎఱ్ఱగుంటపల్లి, పల్లిపురము, ( 133 వరహాల సంవత్సరాదాయము కలది.) గండతిమ్మాపురము (100 రేఖ పొన్నులు సంవత్సరాదాయముగలది.) ఈ గ్రామములుగాక - భిన్న భిన్న సమయములలో 4600 పణాలు 5203 పణాలు 2000 వరహాలు 450 పణాలు 1900 పణాలు 1020 నర్పణాలు 2300 నర్పణాలు సమర్పించినారు.
శ్రీస్వామివారికిని ఎగువ దిగువ తిరుపతులను కడమ చోట్లను వెలసిన వేల్పులకు బహువిధభక్ష్యభోజ్యాది నివేదనలను నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ వరోత్సవాదులలో నింక ననేకవిధముల కైంకర్యములను వనభోజన వినోదములను తమ వంశపారంపర్యముగా తమ పేర జరపించుటకు బయి గ్రామములను ధనమును శ్రీభండారమున నర్పింపగాఁ గోవెల స్థానపతు లందుకు సమ్మతిగా శాసనములు చెక్కించిరి.
ఇవిగాక వీరు కట్టించిన కట్టడములు వగైరాలు :- స్వామిపుష్కరిణి జీర్ణోద్దారము, మెట్లు, మండపములు, నీరాడుమండపము కొండమీఁద తాళ్ళపాకవారి యింటి ముందు మండపము, సంకీర్తన (సంకీర్తనములు చెక్కిన రాగిరేకులు దాచి ఉంచినది) భండారము, అక్కడ దీపారాధనలు, అక్కడ సంకీర్తనలు పాడే వైష్ణవులకు జీతాలు, గుడిగ్రామాలలో చెరువులు కాలువలు బాగు చేయించుటకు ధనదానము, ఆళ్వారుతీర్ధము దగ్గఱ శ్రీలక్ష్మీనారాయణస్వామి ప్రతిష్ఠ ఇత్యాదులు.