Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

అన్నమాచార్యచరిత్ర

సంకీర్తనములలోఁ జాలఁ గలవు. అన్నమాచార్యుఁడు సంకీర్తన లక్షణమున వీనిలోఁ గొన్నింటిని బేర్కొనుటచే నంతకుఁ బూర్వముననుండియు నివి వాడుకలో వచ్చుచున్నవే యనవలెను. తుమ్మెదపదములు, ప్రభాత పదములు, పర్వతపదములు, ఆనందపదములు, శంకరపదములు, నివాళిపదములు, వాలేశుపదములు, గొబ్బిపదములు, వెన్నెలపదములు, సెజ్జవర్ణన, గుణవర్ణన పదములు, పాల్కురికి సోమనాథుఁడు తన గ్రంథములలోఁ బేర్కొన్నాఁడుగాని యవి యిప్పుడు గానరావు. అవి యేవొ పొడిపొడిగా వెలసిన లఘురచనలయి యుండునుగాని ప్రఖ్యాతకపు లానుపూర్వితో రచించినవి గావేమో ! త్యాగరాయలకృతులకుఁ బూర్వమాంధ్రగాయకు లాలాపించు చుండిన గేయము లేవి? యని పరిశీలింపఁగాఁ జాలినంత సమాధానము దొరకకున్నది. నేఁటి గాయకు లందఱును ద్యాగరాయాదులను నూఱేండ్ల క్రిందటి వారినే యెఱుఁగుదురు. సింగభూపాలుఁడు పెదకోమటివేమారెడ్డి ప్రౌఢదేవరాయఁడు (సంగీతరత్నాకరః అనఁబడినాఁడు) సంగీత గ్రంథకర్తలు అన్నమాచార్యుని కించుకపూర్వులు. బయకారరామామాత్యుఁడు, కృష్ణరాయఁడు అచ్యుతరాయఁడు తిరుమలరాయఁడు, సంగీత గ్రంథములకుఁ గర్తలు, కారయితలును వెంకటగిరి, కాళహస్తి, కార్వేటినగరము, నూజివీడు, చల్లపల్లి, ముక్త్యాల, పిఠాపురము, పెద్దాపురము, విజయనగరము, గద్వాల, వనపర్తి ఆత్మకూరు మొదలగు రాజస్థానములు సంగీత వినోదము లేనివిగావు. దక్షిణాంధ్రరచనలలో తంజా పుర్యాదులలో వెలసినగేయరచనలు సురక్షితములుగా నున్నవిగాని తెలుఁగు దేశరచనలు ససిగా దొరకుట లేదేల? కృష్ణరాయలమీఁది గేయరచనలైనఁ గానరావే. ఆనుపూర్వితో క్షేత్రయపదములు, ఏగంటి, చిలుకపాటి పదములు రామదాసుకీర్తనలు, ముత్తేవివారికీర్తనలు, తాడంకివారి కీర్తనలు, నల్లబాటివారి కీర్తనలు, సారంగపాణిపదములు, గుత్తెనదీవిరామాయణ కీర్తనలు, అధ్యాత్మ రామాయణకీర్తనలు, శోభనాద్రీశ్వరసంకీర్తనలు నని కొన్ని గలవుగాని యవియెల్ల నంతప్రాచీనములు గావు. మద్రాసు ప్రాచ్యలిఖితపుస్తకశాలలోఁ గొన్ని పొడిపొడి గేయరచన లున్నవిగాని యందుఁ గొన్ని ప్రాచీనతరములయినను గావచ్చును గాని, యవి యానుపూర్వితో కర్తృనామాంకముతో లేవు. యక్షగానములు గొన్ని వానిలోనిగేయరచనలు గొన్ని కలవుగాని, మొదటి