Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

291

సమర్పించినవాఁడు నగు పెదతిరుమలాచార్యునిమూర్తికూడ నుండవలసినదయ్యెను. పినతిరుమలాచార్యుఁడీ కొఱఁత తీరుటకు మంగాపురమున గుడి కట్టించి మఱొక వెంకటేశ్వరస్వామినే వెలయించి ప్రతిష్ఠించి యక్కడ నాళ్వార్లతో భాష్యకార్లతో దేశికులతోసహ అన్నమాచార్యుని విగ్రహమును గూడఁ బ్రతిష్ఠించి పూజాపురస్కారములు కల్పించెను. తాళ్ళపాక యరద్వారమున కిరుప్రక్కల నున్న విగ్రహములలో నొకటి ముదివయసుది, ఇంకొకటి లేవయసుది, గానున్నది. అన్నమాచార్యచరిత్ర (చూ. 35 పుట) లో నున్న వర్ణనమున కనుగుణముగానే యిక్కడ రూపకల్పనమున్నది.

సంగీతరచన

ద్రవిడ కర్ణాటాంధ్ర భాషలలో కెల్లఁ బ్రాచీనములయిన సంకీర్తనము లన్నమాచార్యునివే. సంకీర్తన శాస్త్రమును గల్పించినవాఁడు నన్నమాచార్యుఁడే. కనుకనే యాతనికిఁ బదకవితా పితామహుఁడని, సంకీర్తనాచార్యుఁడని హరికీర్తనాచార్యుఁడని బిరుదులుగలిగెను. కన్నడమునఁ బురందరదాసుల వారును ప్రాకృతమున వెంకటమఖియు నీయనకుఁ దర్వాతనే సంకీర్తనములను గీతములను రచించిరి. ప్రాఁతవగు కృష్ణాచార్యుని సంకీర్తనములు తాళగంధి వచనములే కాని, పల్లవి చరణములు గల పదకవితా రచనలుకావు. అట్టి తాళగంధివచనరచనలను పెదతిరుమలాచార్యుఁడుగూడ వైరాగ్యవచన రచనమాలికాగీతములని పేర్వెట్టి రచించినాఁడు. అవి వెంకటేశ్వర వచనములని వెంకటేశ్వర విన్నపములని మద్రాసు తంజావూరి లైబ్రరీలలో నుండగా నేను గుర్తించి ప్రకటించితిని.

జాజఱలు, చందమామలు, కోవెల, చిలుక, తుమ్మెదపదములు, లాలి సువ్వి, గొబ్బి, ఉయ్యాల, లాలజోల జోజో జేజే, జయజయ విజయీభవ శోభన మంగళ వైభోగములు, మేలుకొలుపులు, నలుఁగులు, దంపుళ్ళు, కొట్నాలు, కూగూగులు, గుజ్జనగూళ్ళు, చందమామ గుటకలు, నివాళులు, ఆరతులు, మంగళారతులు, జయమంగళాలు, అల్లోనేరేళ్లు, చాఁగుబళాలు, బళాబళాలు, సాసముఖాలు, అవధానములు, తందానలు, వెన్నెలలు, చిత్తమా, మనసా, బుద్ధి (సంబోధనలు) మొదలగు మధురకవితారచనా విశేషము లీ