286
అన్నమాచార్యచరిత్ర
వేంకటాచలమాహాత్మ్యము
సంస్కృతభాషలో శ్రీవేంకటాచలమాహాత్మ్యము నన్నమాచార్యుఁడు రచించెను. (చూ. 46 పుట.) వరాహపురాణాదులలోనిదిగా సంఘటితమయి పదునేడు పదునెనిమిది శతాబ్దముల పిదప తెల్గు పరివర్తనము పడసి ప్రాచీనతాళ పత్త్రప్రతులు గలిగి యిప్పుడు నాగరాంధ్రాక్షరములలో ముద్రితమై వ్యాప్తిగాంచియున్న వేంకటాచల మాహాత్మ్యము నాఁడు తాళ్ళపాక యన్నమాచార్యుఁడు రచించినది యయినను గావచ్చును. అష్టాదశపురాణములలోఁ జేరినవిగాఁగానవచ్చు స్థలమాహాత్మ్యముల నన్నింటిని సమకూర్చి గ్రంథసంఖ్యను గణించినచో నష్టాదశపురాణములకుఁ బ్రాచీనులే పరిగణించిన గ్రంథసంఖ్య కంటె నీ స్థలమాహాత్మ్యముల గ్రంథసంఖ్య చాల మీఱి పోఁగలదు. వ్రాఁతప్రతులుగలిగి పురాణక్రమ నిర్వచనమునఁ జెప్పఁబడిన యానుపూర్విగలిగి యనేక స్థలములం దుపలభ్యమానము లగుటచే ముద్రితములయిన యష్టాదశపురాణములలో నాయాస్థలపురాణములు నూటికిఁ దొంబది తొమ్మిది వంతులు గానవచ్చుటేలేదు. పురాణపు ముద్రాపకులు కొన్ని స్థలపురాణములను నేఁటిపురాణముద్రణములందుఁ జేర్చుటయు జరగకపోలేదు. అది యొక మహత్తరచర్చ. అధ్యాయసంఖ్యలు, పురాణముల పేళ్ళు ఉన్నను నేటి స్థలపురాణము లెల్ల నాయాపురాణములలో దొలుత రచితములు గావనుట ప్రఖ్యాత సత్యార్థము. ఇంచుమించుగా నిటిస్థలమాహాత్మ్యములు పదుమూఁడు పదునాల్గు శతాబ్దములనుండి నిన్నటినేఁటి దాఁకఁ గూడ నుప్పతిల్లుచునేయున్నవి. కాన, అన్నమాచార్యుఁడు రచించినాఁడన్న
వేంకటాచలమాహాత్య్మమిప్పుడు ప్రఖ్యాతముగానున్న వేంకటాచలమాహాత్మ్యము కావచ్చుననుట విడ్డూరపడవలసిన విషయముకాదు. ఆతఁడేదో సంస్కృతము ననుసరించి తెల్గున స్థలమాహాత్మ్యము రచించెననఁ గాదు. “దివ్యభాష। నా వేంకటాద్రిమాహాత్మ్య మంతయును । రచించె" నని కలదు. జియ్యర్ రామానుజయ్యంగా రనువారు క్రీ. 1491 నాఁడు (అప్పటి కన్నమాచార్యుఁ డఱువది యేడేండ్ల వయసువాఁడు) తాను విన్నపముచేసిన తిరువేంకటాచలమాహాత్య్మమునకు శ్రీ స్వామివారు స్వీకారము చిత్తగించి ఆలకింప ననుగ్రహించునట్లు చేయుటకును, గొన్ని యుత్సవములు జరుపుటకును ఉభయముగాఁ గొంతద్రవ్య మొసఁగి స్థానాధిపతులచే శిలాశాసనము చెక్కింపించుకొన్నారు. [1]
- ↑ చూ - తిరుపతి శిలాశాసనముల వాల్యుం 2 నెం 95 శాసనము.