వేటూరి ప్రభాకరశాస్త్రి
285
తెలియుచున్నదిగదా. ఇంక నెన్ని యెప్పుడెక్కడికిఁ జేరినవో? క్రీ. 1560 ప్రాంతముల దాఁక సంకీర్తనములను రాగిమీఁదఁ జెక్కించుట జరిగినట్లున్నది. విద్యానగర విప్లవముమూలమున దక్కిన వానిఁ జెక్కించుట సాగక తాళపత్రములమీఁదనే యుంపఁగా కాలవశమున నవియుఁ జెడియుండును. 1560 క్రీ. పూర్వమే కొన్ని సంకీర్తనములు తంజావూరికిఁ జేరియుండును. అక్కడఁ గలసంకీర్తనము లన్నియుఁ దిరుపతి రాగిఱేకులమీఁద నున్నవోలేవో? శేషాచార్యులవారి తాళపత్రప్రతిలోని సంకీర్తనములు గూడ నన్నియు రాగిఱేకులమీఁది కెక్కినవోలేవో? పెదతిరుమలాచార్యుఁడుగూడ దినమున కొక సంకీర్తనము చొప్పునఁ దండ్రియానతిని రచించెను. అవికొన్ని వేలుండవలెను గదా! కానరావు.
ద్విపద రామాయణము
అన్నమాచార్యుఁడు ద్విపదముగా నవముగా రామాయణమును గూడ రచించెనట. ద్విపదరచనమంతకు ముం దింకొకటి కలదని సూచించుటకు నవముగా ననుట. ఈతని రామాయణరచనము నేఁడు గానరాదు కాని, రామాయణకథాప్రసక్తములు సంకీర్తనము అనేకము లున్నవి. రాగిఱేకులమీఁద నన్నమాచార్యుల సంకీర్తనములను శృంగారమంజరిని మాత్రమే తత్పుత్రుఁడు పెదతిరుమలాచార్యుఁడు చెక్కించెను గాఁబోలును.[1]
- ↑ తిరుపతి దేవస్థానమునగల రాగిరేకులలోనన్నమాచార్యుల రచనములను కొనఁదగినవి యించుమించుగా రెండువేలుండును. అన్నమాచార్యుని సంకీర్తనముల తొలిరేకున నామాంకముగలిగి ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఇత్యాది క్రమసంఖ్యాంకములతో రేకుల యడ్డము నిడుపుల సమపరిమాణముతో నున్న రేకులసంఖ్యను ఇంచుమించుగా రేకున కాఱు పాటల చొప్పుననున్న పాటలసంఖ్యను, బరిగణించి యీ మొత్తము గుర్తింపఁగల్గితిమి. అట్లే తొలిరేకుపై పెదతిరుమలాచార్యుల నామాంకముతో 1,2,3, సంఖ్యాక్రమముగల రేకులను వానియడ్డము
నిడువుకొల్తల పృథక్త్వమును గమనించి పెదతిరుమలాచార్యుల సంకీర్తనముల సంఖ్యను, చిన్నతిరుమలాచార్యుల సంకీర్తనముల సంఖ్యను గుర్తింపఁగల్గితిమి.
కాని, యన్నమాచార్యులరేకులని కొల్తలపరిమాణము, సంఖ్యాను పూర్వియుగల రేకులలోఁగూడఁ గొన్ని యన్నమాచార్యులప్రసక్తములు తత్పుత్రుఁడో పౌత్రుడో రచించినవికూడఁ గలసెఁగాఁ బోలునని కొన్ని సంకీర్తనములలోని విషయములఁబట్టి సందేహింప నవకాశముకలిగినది.