Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

277


అన్నలజోల

అన్నమాచార్యుఁడు శృంగారమంజరి [1] యను మంజరీచ్ఛందోమయ రచనను భాషచే భావముచే శృంగారసుందరమైనదానిని శ్రీ వెంకటేశ్వరస్వామివారిపై రచింపఁగాఁ జిత్తగించి స్వామి యన్నమాచార్యు నిట్లనుగ్రహించెను. (చూ. పుట. 41)


శృంగారమంజరిఁ జేసి శేషాద్రి
శృంగవాసునకు నర్పించి యిచ్చుటయు
నాడుచుఁ బతకమాకన్నల జోల
పాడఁగ నాఁడెల్ల బసిబిడ్డనైతి
నాకృష్ణమాచార్యు నధ్యాత్మవినుతి
రాకఁ గొన్నాళ్ళు విరక్తుండనైతి
జగతి నీ శృంగార సంకీర్తనముల
కగపడి మంచిప్రాయపువాఁడ నయితి
నని వెంకటేశ్వరు డన్నమాచార్యుఁ
గనుఁగొని వాక్రుచ్చి గారవించుటయు


పై గ్రంథభాగమునఁ దొలుత పతకమాకన్నలజోల తర్వాత కృష్ణమాచార్యునధ్యాత్మవినుతి కలవు. కృష్ణమాచార్యుఁడు కాకతీయ ప్రతాపరుద్రునినాఁటివాఁడు. కాన, యాతని వినుతికి ముందు గల పతకమా కన్నలజోల యంత కింకను బ్రాచీనము కాఁబోలును. అదియెట్టిదో యెక్కడేని కలదేమో తెలియఁ జాలకున్నాను. వాక్యము సరిగానున్నదో లేదో కూడఁ దెలియదు. పతకమాక ఊరిపేరేమో ! అది పతకమాకో లేక పతకమూరో పొతకమూరో ఇంకేదో ఆయూరివాఁ డయిన అన్నలు అనుగేయకవి జోలపాట రచించి యాడుచు నొండె స్వామి బాలుఁడై యాడఁగానొండెఁబాడెడివాఁడని యర్థము. కాఁబోలును. పయి, పతకమాకయన్నలజోల సుప్రఖ్యాతమయి తాళ్ళపాకవారు మెచ్చినదయి యుండును.

రాగిఱేకులలో అన్నమాచార్యుఁడు రచించినవే యనేకములు జోలలు
  1. ముద్రితము. తాళ్ళపాకరచనలు 1 వాల్యుం.