Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

275

యీతనిని శ్రీ వెంకటాద్రినాథ దయావర్దితరాజ్యుఁడని రత్నాంశు మత్కాంచీ వెంకట కాళహస్తి నగరీకళ్యాణసౌధాంచల ప్రాంచచ్ఛాశనుఁడనీ తాను గృతిచేసిన జైమిని భారతమున వర్ణించినాఁడు.

శ్రీ తిరుపతి వేంకటేశ్వరస్వామి కీతఁ డనేకోత్సవ విశేషములు నైవేద్యవిశేషములు, ఆభరణవిశేషములు, ప్రాకారమండప సోపానాది నిర్మాణ విశేషములు ధనవ్యయముతో వెలయించినాఁడు. వానిని గూర్చి శాసనములు పదునాలు గున్నవి. స్వామి కైంకర్యపరాయణులై కొండమీఁదఁ ప్రఖ్యాతిగాంచియున్న కందాళ రామానుజ జియ్యంగారి కీతఁడు శిష్యుఁ డయ్యెను. పై కైంకర్యములు స్వామికిఁ గావించుటలో నన్నమాచార్యులయు నా జియ్యంగార్లయు నుపదేశముల నాతఁడు పాటించు చుండవచ్చును.

నాఁటి యన్నమయ

ఆనాళ్ళలో నన్నమాచార్యుఁడు తనయగ్రహారములలోను దాళ్ళపాకలోను గొంతకాలము వసించుచువచ్చినను దిగువ తిరుపతిలోను గొండమీఁద స్వామిసన్నిధిని నెక్కువకాలము గడపుచువచ్చెను. ఆ చోట్ల గృహాది వసతులాతనికాలముననే యేర్పడెను. ఆతని కుమారుని నాళ్ళలోఁ గొండమీదను దిగువ తిరుపతిలోను దమగృహములముందు మండపముల గట్టించి యక్కడ స్వామిని వేంచేపు చేయించి యుత్సవాదులు జరపించుట సాగెను.

గుండక్రియ


            కోటికిం బడగయెత్తి కొంకనేల ।
            యీటులేని పదమెక్కి ఇంకనేల చింత ॥పల్లవి॥

పెట్టినది నొసలను పెద్ద పెద్ద తిరుమణి
కట్టినది మొలఁ జిన్న కౌపీనము ।
పట్టినది శ్రీహరిపాదపద్మమూలము ।
యెట్టయినా మాకుమేలె యింకనేల చింత ॥కోటి॥ 1

చిక్కినాలో నైనది శ్రీవైష్ణవధర్మము ।
తొక్కినది భవముల తుది పదము ।