Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

263

సాళ్వనరసింగరాయనికి బ్రహ్మహత్యాపాపము చుట్టుముట్టఁగా దానిని మాధ్వమతాచార్యులగు శ్రీపాదరాయలవారు విడఁగొట్టిరట. ఈ బ్రహ్మహత్యకారణముగాఁ దిరుపతి వేంకటేశ్వరస్వామి యర్చనము నిలిచిపోఁగా వ్యాసరాయలు పండ్రెండేడ్లు స్వామియర్చనము సలిపి నెమ్మదిగా మరల వైఖానసులఁజేర్చిరట ! శ్రీపాదరాయాష్టకములో నీ శ్లోకమున్నది.


శ్రీమద్వీరనృసింహరాయనృపతే ర్భూదేవహత్యావ్యథాం
దూరీకృత్య తదర్పితోజ్జ్వలమహాసింహాసనే సంస్థితః
శ్రీమత్పూర్వ కవాటనామకపురే సర్వేష్టసిద్ధిప్రదః
శ్రీ శ్రీపాదయతీంద్ర శేఖరమణి ర్భూయా త్స వః శ్రేయసే.[1]


క్రీ. 1440 నాఁటికి బదునాఱేండ్లవాఁ డయిన యన్నమాచార్యుఁడీ రాజోప్లవము లెల్ల నెఱుఁగున్నాఁడు. నరసింహరాయల ప్రార్థనమునఁ గాబోలును దఱచుగా విద్యానగరమున కరుగుచు నక్కడ వెలసియున్న వేల్పులపై పెక్కుసంకీర్తనముల రచించినాఁడు. ఆయా కాలములలో నాతని కక్కడిరాజుల దౌర్జన్యములు ప్రత్యక్షము లగుచుండెడివి. రాజ్యలబ్ధికై నాఁటి రాజులు చేసిన పితృభాతృ పుత్రహత్యాదులు నాతఁడు సంకీర్తనములలో వివరించి విలపించినాఁడు.

శ్రీరాగం


            వెఱతు వెఱతు నిందు వేడుకపడ నిట్టి
            కుఱుచబుద్ధుల నెట్టు గూడుదునయ్యా ॥పల్లవి॥

దేహమిచ్చినవానిఁ దివిరి చంపెడువాడు ।
ద్రోహిగాక నేఁడు దొరయటా ।
ఆహికముగ నిట్టి అధమవృత్తికి నే ।
సాహసమున నెట్టు చాలుదునయ్యా ॥కుఱు॥ 1

తోడఁబుట్టినవానిఁ దొడరి చంపెడువాఁడు ।
చూడ దుష్టుఁడుగాక సుకృతియట ।
పాడైన యిటువంటి పాపబుద్ధులు సేసీ ।
నీడ నిలువ నెట్టు నేరుతునయ్యా ॥కుఱు॥ 2

  1. దీనిని దొలుత కర్ణాటచరిత్రకారులు గుర్తించిరి.