Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

అన్నమాచార్యచరిత్ర

విజయనగరరాజ్యపు విప్లవ (విరూపాక్ష చంద్రశేఖరరాయల) కాలమున గాఁబోలును కపిలేశ్వర గజపతి యొకమాఱును, పురుషోత్తమ గజపతి యింకొక మాఱును విజయనగరము మీఁదికి దండెత్తి వచ్చిరి. తొలితూరి కొంత కప్పము చెల్లించి విరూపాక్షరాయఁడు గాఁబోలును విజయనగరమును రక్షించుకొనెను. రెండవతూరి పురుషోత్తమ గజపతికి సాళ్వనరసింహరాయఁడుదయగిరి రాజ్యమున నొసంగి విజయనగరమును గాపాడఁగలిగెను.

కపిలేశ్వరజగపతి : -


ప్రసహ్య కర్ణాటమహేపతేః పురీం నిరుధ్య విద్యానగరీం నిజైర్బలైః
సమున్నతం మానమివోచ్ఛ్రయంకరం సమాదదే కర్కశచక్రవిక్రమః


పురుషోత్తమగజపతి :-


యస్మై నిత్యతరప్రతాపదహన జ్వాలాయమానధ్వజ ।
స్తంభాబద్దకుసుంభరక్తవసన ప్రేక్షావిభగ్నద్విషే ।
సంధాయాభయయాచానాంజలి మహోదత్వోదయాద్రింభయా
దాత్మానం ముముచే నృసింహనృపతిః కర్ణాటదేశాధిపః॥[1]

చరిత్రకారు లీ సందర్భము నిట్లు గుర్తించిరి.


“విషయాసక్తుఁడగు విరూపాక్షరాయని నాతని పెద్దకొమారుఁడగు రాజశేఖరరాయలు చంపించెను. (1478) ఇతనిని ఈతని తమ్ముడగు రెండవ విరూపాక్ష రాయలు చంపించెను. కాని, యీభ్రాతృహంత పరిపాలనము ప్రజల కిష్టమైనది గాదయ్యెను. అతని దండనాయకుఁడగు సాళువనరసింహరాజు సర్వజనులు తనకు అనుకూలురుకాఁగా రాజును వెడలఁగొట్టి రాజ్యమును ఆక్రమించుకొనెను. అంత నీ ప్రథమవంశమంతరించెను. (1487) తర్వాత సాళ్వనరసింహరాజు 1487 నుండి 1490 దాఁక రాజ్యమేలెను”[2]
  1. అనంతవర తామ్రశాసనము, భారతిసంవత్సరాది సంచికలోను, కళింగదేశ సంచికలోను ప్రకటితము.
  2. మహమ్మదీయమహాయుగము.