Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

221

టి లిపిరీతిని, నేఁటి పఠనార్హ లిపిరీతికి ననుగుణముగా మరల వ్రాసి ప్రకటింప వలసియున్నది. ఇందుకై డైరెక్టరుగారగు శ్రీపరవస్తు వేంకటరామానుజస్వామి యం. ఏ, గారు ఈ వాల్యుము నింతటితో ముగించి పై విషయమెల్ల నుపోద్ఘాతముగా నిందు వెల్లడించుట యుక్తమనుటచే నట్లు చేసితిని.

లభించిన తాళ్ళపాకవారి రచనముల ఱేకులు రెండువేల యాఱువందల ముప్పదియైదింటిని, పరిశోధించి, చిక్కులు దీర్చి, విషయ విభాగము, కవి విభాగము, ముద్రితా ముద్రిత విభాగము మొదలగు వివిధ విభాగముల నెల్ల సమకూర్చుటలో శ్రీతిరుపతి వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధన కార్యాలయమున తెలుగు పరిశోధక విద్యార్థిగా నున్న చిరంజీవి విద్వాన్ ఎ.వి. శ్రీనివాసాచార్యులు ప్రధానముగా పరిశ్రమించి స్పష్టమయిన యెఱుకను నాకు జేకూర్చెను.

ఇఁకపై నాధ్యాత్మ సంకీర్తనముల శేషమును శృంగారసంకీర్తనముల శేషమును, గ్రమముగా వాల్యుములుగాఁ బ్రకటింపగలము.

తాళ్ళపాకవారి పదములలోని యపూర్వ శబ్దార్థసంపదలను, రచనా విశేషములను, నాఁనాటి లిపిసంప్రదాయములను వెలువడనున్న వాల్యుములలో వివరింతుము.


శ్రీ వేంకటేశ్వర ప్రాచ్యవిద్యా

పరిశోధనాలయము, తిరుపతి.

వేటూరి ప్రభాకరశాస్త్రి