Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

211

దేవస్థానమువారు ముద్రించునప్పుడవి మిక్కిలి నిర్దుష్టముగా నుండగలవని, వారు ముద్రించుచుండఁగానే నాత్రపడి ముద్రించుట వ్యర్థమని వెఱచి యా గ్రంథము బయల్పడిన తర్వాత నా ప్రకటన విషయమే యోజించుకొన వచ్చునని యుపేక్షించితిని. అచ్చుపడిన యాఫారము లెల్ల నాంధ్రపత్రికా కార్యాలయముననే యుండెను. తర్వాతనే తిరుపతి దేవస్థానమువారి ముద్రణము ముగిసెను. అటు తర్వాతఁ గొన్నాళ్ళకుఁ జూతునుగదా! అందు నలువదియేడు వచనములే ముద్రితములయి యుండెను. మఱిమూఁడేండ్లకు నేను తిరుపతివచ్చి పరిశీలింపఁగా తర్వాతి వచనములయునికి యెఱుఁగ రాలేదు. అవి యహోబిలముననో శ్రీరంగముననో యడఁగి యుండఁబోలును! ప్రాచ్యలిఖిత పుస్తకశాలలోను, దంజావూరి సరస్వతీభాండాగారములోను నున్న వచనములు సమకూర్చికొని చూడఁగా 175 వచనములున్నవి. ఇంకఁగొన్ని లోపించియు నుండఁబోలును ! నేను రెండు లైబ్రరీలలోని విషయములను సమకూర్చుకొని యుంటిని. తిరుపతి దేవస్థానముద్రణము తప్పులతో నసమగ్రముగానే యుండెను. ఈ విషయము వివరించి తెలుపఁగా నప్పుడు శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య విద్యాలయమున డైరెక్టురుగా నున్న సరస్వతీ హృదయాలంకారులు శ్రీమాన్ యమ్. కృష్ణమాచార్యులుగారు నా ముద్రణము పూరింపఁగోరిరి. వెదకఁగా మదరాసులోని యచ్చుఫారములెట్లో యెక్కడో చెల్లిపోయినట్లు తెలిసెను. నా దగ్గఱ మిగిలియున్న యచ్చుఫారములబట్టి 120 వచనముల మరలనిపుడు ముద్రించుట, కడమయ ముద్రితములఁబూరించుట, జరపితిని ఇట్లుదీనిని వెల్లడింపఁజూచునాఁటికి శ్రీకృష్ణమాచార్యులుగారు కీర్తిశేషులయిరి. శ్రీమాన్ పరవస్తు వేంకట రామానుజస్వామి యమ్.ఏ. డైరెక్టరుగారు దీని ముద్రణ యత్నము సాగించిరి. ఇట్లు శ్రీస్వామి వారు స్తుతిగ్రంథము శ్రీ స్వామివారి యాస్థానకవి రచించినది. యీనాఁటి కిట్లు శ్రీస్వామివారి యాస్థాని లోనే ప్రకటితమగుట సంఘటిల్లినది. ఆనాఁటి తాళ్ళపాక వంశమువారు మహనీయులు. వారి రచనము లింకనెన్నో ప్రకటితములు గావలసియున్నవి. వారు శ్రీస్వామి వారికెన్నో కైంకర్యములు జరపిరి. తన భక్తులగు నట్టి యా మహనీయుల సత్‌కృతులను శ్రీస్వామివారు సంరక్షించుకొందురనియే యాశించుచున్నాఁడను.


శ్రీ వేంకటేశ్వర ప్రాచ్యవిద్యా

పరిశోధనాలయము,

వేటూరి. ప్రభాకరశాస్త్రి

తిరుపతి., తారణ ఫాల్గుణము.