వేటూరి ప్రభాకరశాస్త్రి
207
గొప్పదానములు చేసిరి. తండ్రిగారును దామును రచించిన సంకీర్తనములను స్వామివారి సన్నిధిని బ్రతిదినముఁ బాడుటకై యిద్దరు వైష్ణవుల నియోగించిరి. స్వామివారి కోనేటిని, గోపురములను, మంటపములను బెక్కింటిని జక్కఁబఱిపించిరి. కోనేటినడుమ నీరాడుమంటపమును గట్టించిరి. ఇట్లెన్నో పుణ్యకార్యముల జరిపిరి. తండ్రివలె నీతఁడు గూడఁ బూర్ణపురుషాయుష జీవితము గల్గినధన్యచరిత్రుఁ డయియుండును. ఏలనఁగా నీతనితండ్రి క్రీ. 1408 నుండి క్రీ. 1503 దాఁక జీవించెను. అన్నమార్యున కీతఁ డఱువదవయేఁట జన్మించినాఁ డనుకొన్నాను. ఈతని జన్మకాలము క్రీ. 1468 అగును. అప్పటినుండి క్రీ. 1552 తర్వాతిదాఁక నీతఁడు జీవించినవాఁడగును. ఈతనికి సాతానివైష్ణవు లిద్దరు శిష్యులుండెడివారఁట! వారుకూడ నీతనివలె స్వామికిఁ గొన్ని కైంకర్యములు జరిపిరి.
ఈతనికిఁ గుమాళ్ళు 1 చినతిరుమలాచార్యుఁడు 2 అన్నయ, 3 పెద తిరువేంగళనాథుఁడు, 4 తిరువేంగళనాథుఁడు (చిన్నన్న), 5 కోనేటి తిరువేంగళనాథుఁడు.
ఇందు నాల్గవకుమారుఁ డయిన తిరువేంగళనాథుఁడు రచించిన యష్టమహిషీకల్యాణమున వీరి వంశవృక్ష మిట్లున్నది.