Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xii

కావ్యాలకు కూర్చిన పీఠికలు, సమీక్షలు, పరిచయాలు, అభిప్రాయాలు వల్ల తెలుస్తున్నది. కవిరాజు శ్రీ పాదకృష్ణమూర్తి శాస్త్రిగారి శ్రీ కృష్ణ భారతం పై శ్రీ శాస్త్రిగారు వెలువరించిన అభిప్రాయం ఈ సంకలనంలో ఉంది. అదే విధంగా ఆకుండి వ్యాసమూర్తి శాస్త్రిగారి వ్యాసభారత నవనీతం గూర్చిన సమీక్ష కూడా ఉంది. చిదిరెమఠం వీరభద్రశర్మగారి శివపంచస్తవి, తుమ్మల సీతారామమూర్తిగారి ధర్మజ్యోతి, కరణం అశ్వత్థరావుగారి దండకరామాయణం, శుభ్రవేటి తిప్పాజోశ్యులుగారి వేదభూగోళం, మల్లంపల్లి వీరేశ్వర శర్మగారి కాంచీఖండం, బయిరెడ్డి సుబ్రహ్మణ్యంగారి గాంధీశతకం. నందిరాజు చలపతిరావుగారి మంగళగిరి మాహాత్మ్యం, కొండూరు వీరరాఘవాచార్యులుగారి శిల్పదర్శనం, ముదిగొండ నాగవీరేశ్వర కవిగారి శివపురాణం, ముదివర్తి కొండమాచార్యులుగారి ధర్మదీక్ష, బులుసు వేంకటేశ్వరులుగారి మహర్షి జీవితకథామృతం, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, మాదిరాజ విశ్వనాథరావు కవిద్వయ కృత విక్రమాంకదేవ చరిత పద్యానువాదం గూర్చి శ్రీ శాస్త్రిగారు వెలువరించిన సమీక్షలు అభిప్రాయాలు, ఆమోద ప్రోత్సాహాలు ఈ పీఠికా సంకలనంలో చేరాయి.

శ్రీ ప్రభాకరశాస్త్రిగారి మనస్విత, భావసౌకుమార్యం, సాధుప్రవృత్తి, దయాదాక్షిణ్య మాధుర్య హృదయ గాంభీర్యం, దుర్భాకరాజశేఖర శతావధానిగారి రాణాప్రతాప సింహ చరిత్రపై వారు వెలువరించిన సమీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఎల్లలెరుగని వారి ఔదార్యం ఈ సమీక్షలో ప్రతిపదసుందరంగా భాసించింది. గడియారం వేంకట శేషశాస్త్రిగారి శివభారతాన్ని గూర్చి కూడా శాస్త్రిగారు హృద్యమైన సౌశీల్య సుందరమైన అభిప్రాయం వెలువరించారు. ఇంకా వేదాంత దేశికుల వారి హంస సందేశానికి శ్రీమోచర్లవారి అనువాదం, మల్లంపల్లి మల్లికార్జున కవిగారి భోగేశ్వర మాహాత్మ్యం, శ్రీ వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రిగారి అభినందన సంపుటం బులుసు వేంకటరమణయ్యగారి కువలయానందసారాలకు వేటూరి వారి పీఠికలు, అభిప్రాయాలు ఈ పీఠికా సంకలనంలో చేరాయి . అన్నిటికన్నా విశేషం ద్రావిడ వేదమైన నాలాయిరంలో గోదాదేవి