Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

వేంకటేశ్వరవచనములు

వామనునికిఁ దర్వాతవాఁ డగు విశ్వనాథకవిరాజు వచనము నాల్గుదెఱఁగుల విభాగించెను. "వృత్తలేశవిహీన మయినగద్యము ముక్తకము వృత్తగంధి ఉత్కలికాప్రాయము చూర్ణకము నని నాలుగు విధములు.. తొలిది సమాసరహితము. రెండవది వృత్తభాగములతోఁ గూడుకొన్నట్టిది. మూఁడవది దీర్ఘసమాసాఢ్యము. నాల్గవది యల్పసమాసకము.

పయి రచనాప్రభేదములలో రెండింటికి మాత్రము తెలుఁగున భారతాది కృతులలోని వచనభాగములనుండి లక్ష్యము లెత్తి చూపవచ్చును. ప్రాయికముగాఁ గవిత్రయమువారి రచనలలోని వచనరచనములు చూర్ణకములనఁదగినవి. నాచనసోమన, పోతన ప్రభృతుల రచనలు గొన్ని యుత్కలికాప్రాయము లనవచ్చును. వృత్తగంధి రచనలు తెనుఁగునఁ బ్రాచీనకాలమున నంతగా లేవు. ప్రబంధరాజవేంకటేశ్వర విలాసమున వృత్తగంధి వచన రచన లున్నవి. నేఁటికాలమున శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారు రచించిన[1] 'ప్రాఁదెనుగుఁగమ్మ' వృత్తగంధియే. మచ్చుతునుక-

'సిరిఁదాల్చుఱేఁ డొగిఁజిన్ని చూడ్కులఁ జూచు తెనుఁగుఁ జదువుల రచ్చ తీర్పరులారఁ క్రిందను గైవ్రాలునేసిన నే ననయా! యణకువ మెఱయుచు నాయోపు కొలఁదిఁ దెనుఁగుఁజదువులగుఱిచి జాను మీవులంగఁ దొలితెనుఁగు నుడు లనఁ దేటతెల్లగను విన్నప మొక్కండు వినిపింతు మిమ్ము మోడ్చియు నిరుచేయి మ్రోఁకరిలఁబడియు నెఱఁగియుఁ గైవార మొనరంగఁ జేసి తద్దయు వేఁడుదు నాలింపుఁ డయ్య మీరపోలెను నేను బ్రాఁబొత్తములు సాలఁజదువలేన'

కర్ణాటకమున గూడ వృత్తగంధి రచనము లున్నవి. రామాశ్వమేధాదు లందు లక్ష్యములు చూడనగును.

సంస్కృతమున వామనుఁడు పేర్కొన్నముత్తెఱఁగుల రచనములు నున్నవి. కాదంబరీ, దశకుమారచరిత్ర, యశస్తిలక చంపూ ప్రభృతులందును, శ్రీభగవద్రామానుజాచార్యులవారి గద్యత్రయమునందును, బాల్కురికి సోమనాథుని గద్య గ్రంథమునందును వీనికి లక్ష్యము లున్నవి. శ్రీభగవద్రామానుజాచార్యులవారి గద్యత్రయముననుండి ముత్తెఱఁగుల రచనలకు మచ్చుతునుకలఁ జూపుచున్నాఁడను. చూర్ణమునకు -

  1. చూ - ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక 2 సంపుటము సంచిక 3