Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xi

హిందీభాషలోను బద్యరూప పరివర్తనములతో జిత్రములతో ముద్రితమైనది” అని శ్రీ శాస్త్రి గారు సర్వభారతీయ భాషల ఆధునికతా పరిశీలనంలో కూడా అగ్రేసరంగా ఉన్న విషయం విదితం చేస్తున్నారు. ఉత్తమకవిత తత్త్వం ఏమిటో గోవింద రామాయణానికి (ఉత్తరకాండ అనువాదం) తొలిపలుకు రూపంగా ఆవిష్కరించారు శాస్త్రిగారు. శ్రీ వెంకటేశ్వరసాహిత్యానికి సంబంధించిన ఆరు రచనలున్నాయి ఈ సంకలనంలో. తాళ్ళపాక కవులను గూర్చిన సమగ్ర సమాచారం ఈ పీఠికా సంకలనం ద్వారా తెలుస్తుంది.

చిన్నయసూరిని స్మరిస్తూ లోకంలో ఒక్కొక్క పనికోసం ఒక్కొకరు జన్మిస్తారు అని శ్రీ దువ్వూరి వేంకటరమణశాస్త్రిగారు రమణీయంగా నివాళించారు. ఇదేవిధంగా తాళ్ళపాక కవులను గురించి ముఖ్యంగా సంకీర్తన సార్వభౌములైన అన్నమయ్యను గూర్చి శ్రీ ప్రభాకరశాస్త్రి గారు వెలయించిన చారిత్రక విశేషాలు, తిరుపతి దేవాలయంలోని తాళ్ళపాక అరనుంచి రాగిరేకుల సముద్ధరణం వారు ఈ ఘనకార్యంకోసం తిరుపతి చేరారేమో ననిపిస్తుంది. వేంకటేశ్వర వచనములు, శృంగార సంకీర్తనములు, వేంకటేశ్వర లఘుకృతులు, అన్నమాచార్య చరిత్ర, ఆంధ్రామరుకము, తాళ్ళపాక తిమ్మక్క సుభద్రాకళ్యాణము శ్రీ శాస్త్రిగారు తమ పీఠికలతో ప్రకటించారు. తాళ్ళపాక తిరువేంగళప్పకృత అమరు కాంధ్రీకరణానికి శ్రీ శాస్త్రిగారు వ్రాసిన పీఠిక పరిణామంలో చిన్నదే అయినా చాలా విలువైనది. "ఈ శతకశ్లోకములు నూఱును నేర్పరియగు చిత్రకారుడు చదివినచో నూఱు చిత్రములు చిత్రింపగలడు" అన్నారు వారు. అది ఇప్పుడు నిరూపితమైంది.

ధనుర్విద్యావిలాసమనే గ్రంథం కృష్ణమాచార్యుడనే కవి రచించాడు. ఇది మరీ ప్రాచీన గ్రంథం కాదు. కాని, వేటూరి వారు విపులమైన పీఠికతో వెలువరించిందాకా ఇందుకు సంబంధించిన మహత్తరమైన విషయాలెన్నో తెలుగు వారికి తెలియవు. ఈ గ్రంథ ప్రచురణలో వారి పరిశ్రమ చాలా అక్కజం గొలుపుతుంది. వారి వివిధ శాస్త్ర పాండిత్యం, సమన్వయ కౌశలం ఈ పీఠికలో అడుగడుగునా పొడకడుతుంది. సమకాలీన ఆంధ్రసాహిత్య ప్రపంచానికి శ్రీ శాస్త్రిగారిపట్ల ఉండే గౌరవ ప్రపత్తులు వారు అనేక ఆధునిక