వేటూరి ప్రభాకరశాస్త్రి
193
ప్రతారణము వనిగొనును. సత్య స్వరూపము, సువ్యక్తము గాక పోఁగా నూహా పరికల్పితమైన, సత్య ప్రతికృతియే కవిత యగుచున్నది. అట్టిదానికి భాషాపరిష్కృతి, యలంకార విడంబము, శయ్యా వైయాత్యము, వస్తువిన్యాస వైచిత్ర్యము, పనిఁబూని కొని తేవలసి యుండును. కూటసాక్ష్యము చెప్పువాఁడు కథకట్టుకొని పూర్వాపర సందర్భముల నెన్నింటినో పూనికతోఁ బొసఁగించుకొనవలసినవాఁడగును. ఎంత పొసఁగించు కొన్నను తుదకు వాఁడదను దఱిసి నవు డవకతవకలకుఁ బాల్పడు చుండును. సత్యము వాక్రుచ్చువాఁడు తొట్రుపడక యున్న దున్నట్లు నిర్వికారముగా నిబ్బరముగా నిరూపణము చేయఁగల్గును. "టాగూరు బంగారు కలము చికిలి వ్రాతల కంటె గాంధి యినుప కలము గీటు వ్రాతలు చుఱుకయినవి, సూటియైనవి, సుందరమయినవి ! " అని.
యిట్టి వేవేవో భావములు నాకు రేకెత్తుచుఁ గైతయన్న రోఁత తోచుకాలమున గోవింద రామాయణ మిది చేత చిక్కినది. ఇది యేదో రామాయణ కథారచన యని యీసడింపుతోనే యెత్తికొనియు దొలి పద్యము దొరకొని యితిశ్రీదాక యేకధారగాఁ జదివియే యింకొకరి చేత బెట్టవలసిన వాఁడనయితిని. నన్నీ కావ్యమంత తన్మయునిఁ గావించినది. కవితా విడంబనమంతగా నాకిందుఁ గానరాలేదు. కవి కిందు శ్రీ రామచంద్రమూర్తి దివ్యధ్యానము, తత్సచ్చరిత్ర ప్రణయనతత్పరత, పరమార్థలిప్స, యనునవియే యీ గ్రంథరచనమున హృదయమునఁ దొలఁకు లాడినవి. ఉత్తర రామాయణ మందున్న యుపకథలెల్ల నిందుపేక్షింపఁబడినవి. తిక్కన నిర్వచనోత్తర రామాయణము, పాపరాజు నుత్తర రామాయణము మొదలగునవి కవితా విలాసంపు సొంపు నాస్వాదింపగోరి కూరిచినకృతులు. ఈ గోవింద రామాయణమునకు వానికిని పోలికలేదు. ఈ గ్రంథములు పాఠకునిఁ గవితా స్వారస్య కల్పనా చమత్కారానుభవ రసికునిఁ గావింపఁ గల్గినవి. ఈ గ్రంథము పాఠకుని శ్రీరామభక్తిపరుని, సుఖదుఃఖ నిర్వికారుని పరమార్థ పరాయణునిఁ గావింపఁగల్గినది. కవితావికృతులంతగాఁ గానరాకున్నంత మాత్రమున నిది కావ్యగౌరవము లేనిదనఁగాదు. వంకలు దీఱినశయ్య, పొంకములుగల పలుకుతీరు, శుచిరుచులు గల పాకము, వడిగల కథావస్తుగతి యిందున్నవి.