Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

మొయిలు మెఱుగులు

పలుకు పొంక (సౌశబ్ద్యము) మిందుఁ గులుకులాడు చున్నది. కాళిదాసుని వ్యంగ్య గౌరవ మిందుగడలుకొన్నది. క్రొమ్మెఱపు వగలాఁడికిని గూర్మి సంగడీఁడవయి కూడి వినోదించు చుంటివి గాన నీవే నా నెయ్యురాలియెడఁ బాటు వగపును గుఱుతింపఁ గల్గుదువు. జీవన మిచ్చి సర్వ లోకములనుదేల్చు సారస్యము నీ కున్నది. కావున, నా విన్నప మాలింపను బాలింపను గల్గుదువు అని యిందు ధ్వని. ఇట్టి ధ్వని చమత్కృతి కాళిదాసుని కృతిలోఁ బిక్కటిల్లి యున్నది.

శ్రీ వేంకటరాయ శాస్త్రులవారు తమ యాంధ్ర వ్యాఖ్యానమునఁ బద ప్రయోజన మను పేర నిట్టి వ్యంగ్య చమత్కృతులఁ జాల వివరించియున్నారు. శ్రీ ప్రసాదరావుగా రా వ్యంగ్యార్థముల కెందును భంగము గల్గనియట్లు, అంతేకాక పరిశోషణము గల్గునట్లు, తమ తెలుఁగు సేఁత వెలయించిరి. అట్టి పట్టు లనేకములు వివరించి తెలుపఁదగినవే యయినను విస్తరభీతిని విడుచుచున్నాను. పూర్వ మేఘమునఁ దొలియైదు శ్లోకములుం బోను గడమ యెల్ల నలకామార్గ వర్ణనాత్మకములే కాన, యన్ని పాటలకు నిదియే పల్లవియై యుల్లాసము గొల్పుచున్నది. పాట పాటకును నీ పల్లవి యనుగతమై యాశ్లోకార్థము మేఘునిఁ గూర్చి యక్షోక్తియగుటను స్మరింపఁజేయున్నది. ఉత్తరార్ధమున - "కలిమిచెలి కాఁపురము మా యలకాపురము...” ఇత్యాదికము కవికల్పితము. అలకాపుర వర్ణనాత్మకములగు పండ్రెండు శ్లోకములకు నీ మకుటము పనుపడి యున్నది. యక్షుఁడు తన యింటిపట్టు నానవాళ్లు చెప్పు శ్లోకము లేడు నాకు మేఘసందేశమునఁ గడు వేఁడుక గూర్చుచుండును. తెలుఁగు సేఁత లలిత లలితముగా నున్నను నీ

శ్లోకములు గూడ దేశిగేయ రూపముగానే యుండఁ దగిన వనుకొనుచున్నాను. యక్షీ స్వరూప వర్ణనాత్మకము లగు రెండు పద్యములును శ్రీనాథుని సూర్యశతక శ్లోకాంధ్రీకరణములఁ దలపించుచు మనోజ్ఞములుగా నున్నవి. [1]వీని తెలుఁగు సేఁత తీరు కవిశేఖర శ్రీ వడ్డాది సుబ్బరాయ కవి కృత్యుపజ్ఞమై శ్రీ పిచ్చయ శాస్త్రి రచనమునఁ దెనుఁగుఁ బొలుపున విరివిసెందె, విందుగొల్పి యిందు గేయతం బడసి కడుంగడు విందు గూర్చుచున్నది.

  1. చూ. శాత శ్శ్యామాలతాయాః పరశు రివ... సూర్య శతకము చిఱుసానఁ బట్టించి చికిలిసేయించిన గండ్రగొడ్డలి......... (కాశీ ఖండము.)