వేటూరి ప్రభాకరశాస్త్రి
187
బ్రాఁత కాలపుయక్షగానములలోఁ గాననగును. కందుకూరి రుద్రకవి రచించిన సుగ్రీవ విజయమునఁ బదముల నిందుకుఁ దార్కాణగాఁ జూఁడదగును. కాని వానిలోని దేశిరచన లీ కృతిలోని రచనలవలె నిగ్గులు దేరినవిగావు.
ఇది యక్షగానమే
యక్షులు (జక్కులు) కథా పాత్ర వేషములు గొని నృత్యగేయాత్మకముగాఁ బ్రదర్శించు దృశ్య రచనమునకు యక్షగాన మని పేరు. తొలుతనవి శ్రీ శైలాహోబల పర్వతాదులందుఁ బ్రదర్శితము లగు చుండెడివి. ఇదియు నేకపాత్ర ప్రయోజ్యము, దృశ్య రూపకమే. ఇదియు నృత్యగానాభినయానుగుణమగు రచనా చమత్కృతి గలదియే. ఇందు యక్షుఁడే కథా నాయకుఁడగుట మఱియు విశేషము. ప్రధాన గ్రంథమెల్ల గేయాత్మకముగా నున్నను గ్రంథకర్త కడు నేర్పుతో మూల మందలి గ్రంథారంభశ్లోకముల నైదింటిని చూళికగాను, నాయకుని స్వగత సంభాషణము గాను బరివర్తించుటచేతను గ్రంథాంతమునఁ గూడ సంస్కృతమున దొరకుచున్న ప్రక్షిప్త శ్లోకములకు సరస సంగతి గల్గునట్లు మంగళాంతత యేర్పడునట్లును, కథాచమత్కృతిని గల్పించుట చేతను వర్ణనైకాత్మక మయిన కాళిదాసుని మేఘసందేశమున కీ మొయిలు రాయబారమున గానాభినయ చమత్కార సమంచిత మయిన దృశ్య రూపకత సమకూడినది.
మ కు ట ము లు
గ్రంథకర్త తన గేయరూప పరివర్తనములకుఁ బెక్కింటికి మకుటములఁ గూర్చెను. అవి కొన్ని సరిగా మూలమునకుఁ బరివర్తనములు. కొన్ని మూలాను గుణములగు కల్పనా విశేషములు. పూర్వార్ధమున కెల్ల నన్వితమగు మకుటము (పల్లవి) చాలఁ జమత్కృతి గలది.
“క్రొమ్మెఱపు వగలాఁడి కూర్మి సంగడికాఁడ!
క్రొమ్మొయిలు ఱేడ ! గయికొమ్ము నా విన్నపము ;
నెమ్మి........................
..............................సారస్యముగలాఁడ!"