Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

x

లాయధ్వాన పదమును మార్గార్థముగా గ్రహించిరి. మార్గమని, మార్గమనియేని యర్ధముగల సంస్కృత శబ్దమని, అధ్వశబ్దపు దత్సమ రూపమనియేని గ్రహించినను శ్రీనాథుని 'యధ్వానపుంబట్టు' సమర్దితమగును. వ్రాతప్రతి పాఠము పరిగ్రాహ్యమే కావచ్చును. కాని తెల్గుననిక నెక్కడను నీ 'యధ్వానము' నాకు గానరాలేదు” అన్నారు వారు. దీనిని బట్టి వారి అపారపాండితీ పరిశ్రమను పోల్చుకోవచ్చు 'కోహళి' అని పదం అర్ధం గూర్చి చర్చిస్తూ ఈ పదప్రయోగం శ్రీనాథుడూ, నాచన సోమన మాత్రమే చేశారనీ మురారినాటక శ్లోకభాగం దీనికి మూలమనీ' సంస్కృతాంధ్రములలో నాకీ పదమింకెక్కడను గానరాలేదు' అనీ శ్రీ శాస్త్రుల వారు చెప్పారు. కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయ యక్షగానానికి మధుర కవితలు అనే పేరుతో పీఠిక వ్రాస్తూ తెలుగు సాహిత్యంలో యక్షగానాల స్థానాన్నీ, దేశి సాహిత్య ప్రశస్తినీ గూర్చి అపూర్వ హృద్యమైన విషయాలెన్నో తెలిపారు. “దేశి రచనలలో నుండి సింగి, సింగడు, కోణంగి, దరువు అనునవి నటీనటులుగను, విదూషకుడుగను, ధ్రువగను సంస్కృత నాటకముల జేరెనేమోయని కూడ యోజింపదగి యున్నట్టున్నది." అని పురా ద్రావిడ భాషల ప్రభావం సంస్కృతంపైన కూడా ప్రసరించకూడదా అనే విచికిత్సను భాషాశాస్త్రలవేత్తల పరిశోధనల కన్నా ముందుగానే శ్రీ శాస్త్రిగారు ప్రతిపాదించారు. ఇది వారి విశాలహృదయానికీ సత్యాన్వేషణకు నవీన దృక్పథ స్వాగతానికి తార్కాణం. గిడుగు సీతాపతిగారి భారతీశతకానికి ఉపోద్ఘాతం వ్రాస్తూ వ్యావహారికభాషా వాదాన్ని సర్వాత్మనా సమర్ధించారు శ్రీ శాస్త్రిగారు. మొయిలురాయబారము అనే శ్రీ త్రిపురాన వేంకటసూర్య ప్రసాదరావుగారి మేఘసందేశ గేయరూప ఆంధ్రీకృతిని సమీక్షిస్తూ మేఘదూతానికి “నూఱింటి దాక ననుకరణములు నిరువదింటి దాఁక వ్యాఖ్యలు వెలసినవి కాని, యా యనుకృతులేవియు దీనికి దీటు గాజాలకపోయెను. మేఘసందేశము జాతిరత్నమే, అనుకరణములెల్ల బోతరత్నములే” అని వివరిస్తూ “భారతీయుల యెల్ల భాషలలోను నింకనెన్నో ఖండాంతర భాషలలోను నిది పరివర్తితమై చిత్తరువులతో గూడ ముద్రితమై వెలసినది. మన దేశమున నే నెఱిగినంతలో నింతకుముం దిది వంగభాషలోను