Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

మొయిలు రాయబారము

విచార చర్చలో క్షేమేంద్రుఁడు నుదాహరించినాఁడు[1] కాన యది కాళిదాసుని కృత్యంతరముగా గణింపవలసినదే యగును. 'చిద్గగన చంద్రిక' యని దేవీస్తుత్యాత్మకము కాళిదాసీయముగాఁ గాన వచ్చుచున్నది. [2]ప్రాచీనులు దానిఁబేర్కొని రంట. ఇంకను శ్యామలాదండకాదు లేవేవో కాళిదాసకృతులుగా వ్యవహృతము లగుచున్నవి. కొన్ని యున్నవిగాని యవి యాతని కృతులే యని విశ్వసించుటకుఁ దగ్గ యాధారములు గానరావు.

కాళిదాసు క్రీ.పూ. ప్రథమ శతాబ్దివాఁడని కొందఱు, క్రీ.త. నాల్గవ శతాబ్ది వాఁడని కొందఱు నందురు. దిజ్నాగాచార్య ప్రశంస మేఘసందేశమునఁ గల దనియు, నా దిజ్నాగుఁడు క్రీ.త. తృతీయ శతాబ్ది తుదివాఁడనియుఁ, గాన, కాళిదాసు క్రీ.త. నాల్గవ శతాబ్దివాఁడు గాఁదగునని చతుర్థ శతాబ్దీవాదులు తలఁచుచున్నారు. దిజ్నాగుని కాలము సుస్పష్టముగాలేదనియు నాతఁడు ప్రథమ శతాబ్దివాఁ డని కూడఁ దలఁపఁ దగినవాఁ డనియుఁ గాళిదాసు విక్రమార్కుని సభలోని వాఁడను ప్రఖ్యాతి చిరంతనమనియు, గాన, యాతఁడు క్రీ. పూ. ప్రథమ శతాబ్ది వాఁడనుట యుక్తమని ప్రథమ శతాబ్దీవాదులు తలంచుచున్నారు. ప్రథమ శతాబ్దివాదమే సముచితమని నా యభిప్రాయము.

విక్రమార్కుఁడుజ్జయిని రాజధానిగా రాజ్యమేలెను గావునను, మేఘసందేశమున 'వక్రః పంథా యదపి భవత' ఇత్యాది శ్లోకమున యక్షుఁడు చుట్టు త్రోవయయినను మేఘు నుజ్జయినికిఁ బొమ్మని చెప్పి యధికముగా నుజ్జయినీ వర్ణనము పది పండ్రెండు శ్లోకములలోఁ జేయుటచేతను గాళిదాసుఁ డుజ్జయినీ వాస్తవ్యుఁడని పలువురు తలఁచుచున్నారు. ఇది సంగతముగా వచ్చును. కాని యీ క్రింది సాధనములఁ బట్టి యాతఁడు గోదావరీ తీరమువాఁ డనియు గుర్తింప నగుచున్నాఁడు. కాళిదాసు వైదరీతికిఁ బ్రవర్తకుఁడని యాలంకారికు లనిరి.


  1. అధికరణౌచిత్యం యథా కుంతలేశ్వరదౌత్యే కాళిదాసస్య ;--

    "ఇహ నివసతి మేరుః శేఖరః క్ష్మాధరాణా
    మిహ వినిహిత భారాః సాగరాః సప్త చాన్యే
    ఇద మహిపతిభోగస్తంభవిభ్రాజమానం
    ధరణితల మిహైవ స్థానమస్మద్విధానామ్.

  2. ఇది ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో నున్నది.