మొయిలుమెఱుఁగులు
మొయిలు రాయబారము పీఠిక
శ్రీ త్రిపురాన వేంకట సూర్య ప్రసాదరావు దొరగారు నాకు నచ్చిన నెచ్చెలి, ఈ చెలికారమునకుఁ గారణము వారి సరస కవితా చాతురి యే. కాళిదాస భవభూతుల ఘనకృతులను వారు తీరు తియ్యములు వెలయ నింతకు ముందే తెలిఁగించిరి. అపూర్వ సౌందర్యము మెఱయఁగా సంస్కృతకృతుల నాంధ్రీకరించుట యందు వా రందెవేసినచేయి. ఈ నడుమఁ గడుఁ గ్రొత్త తీరున వారు 'మొయిలు రాయబార' మను పేరఁ జేసిన మేఘసందేశపుఁ దెలుఁగుసేఁతను వారి ముఖమున నే విని తనిసితిని. అది కాళిదాసుని 'మేఘసందేశమునకు, మెఱుఁగులు వెట్టునదిగానున్నది. ఆ సంస్కృత కాళిదాసు సందేశమును, ఈ యాంధ్ర కాళిదాసు రాయబారమును బురస్క రించుకొని కవి సౌహార్దానురోధమున నుభయ కవితా ప్రశస్తుల నించుక యుగ్గడింపఁ గడఁగుచున్నాఁడను.
కాళిదాసు
కవికులగురువగు కాళిదాసుని కృతులు రఘువంశ కుమారసంభవ మేఘసందేశము లని కావ్యత్రయమును, శాకుంతల, మాళవికాగ్నిమిత్రీయ, విక్రమోర్వశీయము అని నాటకత్రయమును, ఋతు సంహారమని ఋతు వర్ణనాత్మక మగు లఘు కావ్యమును బ్రసిద్ధము లై ముద్రితములునై యున్నవి. కుంతలేశ్వర దౌత్యమని యొక కృతి (కావ్యమో నాటకమో) కాళిదాసునిదిగా భోజుఁడు తన శృంగార ప్రకాశమునఁ బేర్కొని దాననుండి యొక శ్లోకము
నుదాహరించెను. [1] విక్రమార్కుఁడు కుంతలేశ్వరుని కడకుఁ గాళిదాసు నెందుకో రాయబారినిగాఁ బంపుట యందలి కథయఁట! ఈ గ్రంథము నౌచిత్య
- ↑ శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు కుందమాలా నాటక పీఠికలో పై విషయము వివరించిరి. కుంతలేశ్వరదౌత్య శ్లోక మిది :-
శ్లో. అసకల హసితత్వాత్ క్షాళితానీవ కాన్యా
ముకుళితనయనత్వాత్ వ్యక్తకర్ణోత్పలాని,
పిబతి మధుసుగంధీన్యాననాని ప్రియాణాం
త్వయి వినిహితభారః కుంతలానా మధీశ ! 9వ ప్రకాశము.