వేటూరి ప్రభాకరశాస్త్రి
177
కోర్టులో, కౌన్సిలులో, రేడియోలో సంభాషించుటకు నేఁటికావ్యభాష యుపయోగపడదు. 'వస్తూ', 'పోతూ', 'చూస్తూ, చూస్తూ', 'అన్నారు', 'ఉన్నారు' - ఇత్యాదులను శిష్టవ్యవహారమునుండి చంపివేసి, 'వచ్చుచుఁ', 'బోవుచుఁ', 'జూచుచుఁ జూచుచు', 'అనిరి', 'ఉండెడివారు', ఇత్యాదులను జొప్పింపఁదరముగాదు. 'ఉంటేఊరా', 'పోతేపాడా', 'అంటె అన్నావంటారుగానీ' - ఇటువంటి చవిగల పలుకుబళ్లెన్నో వ్యవహారమున సాగుచున్నవి. వీటి నన్నింటినీ కోర్టు, కౌన్సిలు, రేడియో వ్యవహారములు పరిత్యజింపఁ జాలవు. రేపు స్వరాజ్యమువచ్చి. ఆంధ్రరాష్ట్రము వేఱుపడి కౌన్సిళ్ళలో ఆంధ్రభాషా వ్యవహారముసాగి, తెలుఁగు షార్టుహాండు ప్రబలమై దైవానుగ్రహము దైవాఱితే - పెద్దలు సభలలో వ్యవహరించిన భాషావ్యవహారము స్వస్వరూపముతో పత్రికలలో ప్రకటితము కావలెనేకాని, అది నన్నయభట్టీయాధర్వణీయాది వ్యాకరణ పారాయణ పరాయణులచే పరి సంస్కృతమై ప్రకటితముగారాదు. భాషాప్రయోజనము లెన్నో నానాటికిఁ బ్రబలుచున్నవి. ఇంకను బరభాషలమూలమున నిన్ననేఁడు ననుభవించు లాభముల నెన్నింటినో మాతృభాషమూలమున నింక మన మనుభవింపవలసియున్నాము. ఇట్టి ప్రయోజనములకెల్లఁ బనికివచ్చుటకు వ్యవహారభాష సముచిత పరిపోషము గలది కావలెను.
కాలక్రమమున సముచిత సౌందర్యముతో వ్యవహారభాష పెంపొందగలదు గాన, దానఁగూడ మెఱుఁగులు దేఱి కొంత సత్కావ్యార్హత యేర్పడవచ్చును. యక్షగాన గేయాదిరచనములందు నేఁటికే వ్యవహారభాష పొసగియున్నది. కాని, వ్యవహారభాషకు చంపకోత్పలమాలాది వృత్తములతో నేఁటి దాఁకఁ బెంపుగాంచుచున్న సత్కావ్యభాషతోఁ బొత్తు కుదురనేరదని నే ననుకొనుచున్నాను. వ్యవహారభాష దీర్ఘాక్షరబహుళము. అక్షర గణబద్దములయిన చంపకోత్పల మాలాది వృత్తముల కిట్టి భాష యొదుగదు. దీనిని గుర్తించియే నేఁటి నవకవులు క్రొత్తత్రోవలతో మాత్రాగణ బద్ధములగు దేశిపదరచనల సాగించుచున్నారు.
సర్వతోముఖమయి సాగుచున్న యీ వాఙ్మయ పరిణామమును సర్వేశ్వరుడు సక్రమపద్ధతిని సత్ఫలోదర్కముగా సంరక్షించుననియే నా నమ్మకము.