172
మధురకవితలు
ఇబ్రహీంప్రభు విచ్చినయగ్రహారమును నిన్న మొన్నఁటిదాఁకఁ దద్వంశ్యులే యనుభవించుచుండిరి.
సుగ్రీవ విజయము రచించినరుద్రకవియే నిరంకుశోపాఖ్యానమని గ్రంథాంతరము రచియించెను. రెండు గ్రంథములందును గర్తకు కందుకూరు జనార్దన భక్తత్వము, పెదలింగనార్యపుత్రత్వము గలదు గావున రెండు గ్రంథములు నొక్కనివే యగుట స్పష్టము. నిరంకుశోపాఖ్యానమున,
“చేరి కన్నడభూమి చెఱవట్టుపాశ్యాత్య
నృపతికైనను గొంత కృప దలిర్చు.”
అని సీసచరణ మున్నది. అది విద్యానగరమును దురుష్కులు కొల్లఁగొట్టిన దుస్సందర్భమును దెలుపుచున్నది. విద్యానగర వినాశనము క్రీ.శ. 1568 నాడు జరిగినది. కావున, నిరంకుశోపాఖ్యాన రచన మటుతరువాత జరిగిన
దగును. అప్పకవీయమున వినుకొండలో గుంటుపల్లి భాస్కరయగారి సముఖమునఁ గందుకూరి రుద్రకవి కవితాచర్చ జరపినట్లు కలదు. మన రుద్రకవి యాతఁడగునేమో ! నిరంకుశోపాఖ్యాన సుగ్రీవవిజయకర్త క్రీ.శ. 1568 ప్రాంతములవాఁడేని, కొంతతర్వాతివాఁడేని కాఁగలఁడు. దక్షిణ దేశ మందల్పముగా నాంధ్రదేశమం దధికముగా యక్షగానముల రచనములు, ప్రయోగములు సాగుచుండిన కాల మది.
సుగ్రీవ విజయము
శ్రీమద్రామాయణమునఁ గల కథాఖండములలో సుగ్రీవవిజయకథ యొక కండపట్టు. అత్యల్పకాలమున వడివడిగా గంటలలో నడచిన యీ కథపట్టు రామలక్ష్మణులు, హనుమంతుడు, సుగ్రీవుఁడు, వాలి, అంగదుఁడు, తార అను కథాపాత్రముల శీలపు మేలిమి నొఱసి మెఱుఁగుతఱుగులు చూపిన యొఱగల్లనఁదగినది.
తెలుఁగున గుత్తెనదీవిరామాయణాదులగు రామాయణ గేయకృతులలో నీ సుగ్రీవవిజయపుఁగథపట్టు చాల హృద్యరచనములతో నున్నది.