Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

మధురకవితలు

వీనిలో నాటవికరచనాసంస్కార సూచకముగా, 'ఎఱుకతసాని' పాత్రము వెలసినది. కురవంజులలోని దేసిరచనల కంటె నత్యధికముగా వీనిలో దేసిచ్ఛందోబద్ధము లగు గేయరచనలు ప్రబలినవి. రాజసభలలో, దేవోత్సవములలో, ఊరిజాత్రలలో యక్షగంధర్వాదివేషముల ధరించి [1]వేశ్యలు ప్రదర్శించునవి గావునను నృత్యధర్మములకంటె గేయధర్మము లధికముగాఁ గలవి కావునను, నివి యక్షగానములనఁబడెను. కళావంతులలో నొక తెగకు నేఁడు జక్కులవారను పేరు గలదు. యక్షాదివేషముల ధరించి నృత్యగాన ప్రదర్శనములను గావించుటచేతనే వారి కాపేరు వచ్చియుండ వచ్చును. శ్రీనాథుఁడు క్రీడాభిరామమున జక్కుల వారిని గూర్చి కొంత ప్రశంస నెఱపినాఁడు.


సీ. కోణాగ్ర సంఘర్ష ఘుమఘుమధ్వని తార
               కంఠస్వరంబుతో గారవింప
    మసిబొగ్గు బోనాన నసలుకొల్పినకన్ను
               కొడుపుచేఁ దాటించు నెడప దడప
    శ్రుతికి నుత్కర్షంబుఁ జూపంగ వలయుచోఁ
               జెవిత్రాడు బిగియించు జీవగఱ్ఱ
    గిల్కు గిల్కున మ్రోయుకింకిణీ గుచ్ఛంబు
               తాళమానంబుతో మేళవింప

    రాగముననుండి లంఘించు రాగమునకు
    నురుమ యూరుద్వయంబుపై నొత్తిగిల్ల

  1. శ్రీనాథుఁడు భీమఖండమున ద్రాక్షారామభీమేశ్వర మహోత్సవ సమయములందు సానులు వేషములు వేసికొని నాటకము లాడుట నిట్లు వర్ణించెను.


    సీ॥ విరులదండలతోడి వేణికాభారంబు
                   పొంకంబు పిఱుఁదులఁ జొరలి యాడ
         మణితులాకోటికోమలఝణత్కారంబు
                   రవలి మట్టెల మ్రోఁత యవఘలింపఁ
         గుదురు నిండిన చిన్న గుబ్బచన్నుమీఁద
                   ముత్యాలత్రిసరంబు మురువుఁ జూప
        వలమాన తాటంక వజ్రాంకురచ్ఛాయ
                   లేఁత వెన్నెలఁ బుక్కిలించి యుమియ

        సాని యీశానియై మహోత్సవమునందుఁ
        గేల నవచంద్రకాంతపుగిన్నె పూని
        వీథి భిక్షాటన మొనర్చువేళఁ జేయు
        మరులు నృత్యంబు జగముల మరులు కొలుపు. (ఆ.1.005)

    వ॥ మహోత్సవమండపమునందుఁ బేరోలగం బుండి, కుండలీదండ లాసకప్రేరణీ ప్రేంకణసింధుకందక ధమాళి చేల మత్తల్లీ హల్లీసకాది నృత్యంబు లవలోకించుచు. (ఆ.1.118)

    శ్రీనాథునికాలమునకే దేవోత్సవాదులయందు వేశ్యలు వేషములుకట్టి నాటకములఁ బ్రదర్శించు సంప్రదాయము ప్రబలినది.

    "కీర్తింతు రెవ్వానికీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి" భీమ. 3. ఆశ్వా. శ్రీనాథునికాలమున యక్షగానములు ప్రబలియుండుట దీనిచేఁ దెలియనగును.