వేటూరి ప్రభాకరశాస్త్రి
165
వెలసిన యా దృశ్యరచనములు తొలుత నత్యల్పముగా గేయ భాగములును విశేషముగా నృత్యమును గలవై యుండెను. అవి సింగి- సింగఁడు - అని యిద్దఱు పాత్రములు గలవై సంస్కృత వీధినాటకములఁ బోలియున్నవి. సింగి, సింగఁడు సంస్కృతనాటకములలోని నటీనటులవలె నాలుమగండ్రు. వీరిద్దఱే కథాపాత్రములగుచుందురు. కొన్నింట గథాసంధాయకుఁడు - సంధివచనములఁ జెప్పువాఁడు - విదూషకుఁడనఁదగినవాఁడు - మూడవపాత్రము -కోణంగి యనువాఁడు - (పిదప చోడిగాఁడు) కాన నగును. కోణంగి సంస్కృతనాటకములలోని ధ్రువాగానమే కురవంజులలో దరువనఁబడెను. దేశిరచనలలో నుండి సింగి, సింగఁడు, కోణంగి, దరువు అనునవి నటీనటులుగను, విదూషకుఁడుగను, ధ్రువగను సంస్కృతనాటకములఁ జేరే నేమో యని కూడ యోజింపఁదగినట్టున్నది. ఎంతో కాలమిట్లు కొండపట్టులందు సాఁగుచుఁ బెంపొందిన గేయ నృత్యసందర్భములు నగరములకుఁ గూడఁ గ్రమముగా వ్యాపించినవి. చెంచులు, కురవలు నడవులనుండి పులిగోర్లు, అడవిపంది కోఱలు, అడవిపండ్లు వెదురు బియ్యము, వెదురుబెత్తములు, పిల్లనగ్రోవులు, సూదంటురాళ్ళు, ఓషధులు, తేనె మొదలగు నాటవిక వస్తువులను నగరములకుఁ గొనివచ్చి యమ్ముచు నప్పుడప్పుడు తమ గేయనృత్యవిశేషములను నగరములందును, బల్లెలందును బ్రయోగించుటచే నవి నాగరకదేశములందును వ్యాపించెను.
యక్షగానములు
ఇట్లు నగరములందు నభిరుచి గొల్పినయాగేయ విశిష్టనృత్యదృశ్యములు, జక్కులవారు (యక్షులు, కళావంతులు) తర్వాత నగరములందును బ్రయోగింపఁ జొచ్చిరి. వీరి ప్రయోగములందు దృశ్య మయిననృత్యాభినయములతోపాటుగా నధికముగా గేయవచనరూప మైన శ్రవ్యరచనము గూడఁ జేరెను. కురవంజులకంటె యక్షగానములు పర్యాప్తముగా శ్రవ్యము లగు కవిరచనములు గలవి. వీరిరచనములలో బహువిధము లగు పురాణకథలెల్లఁ జేరినవి. కురవంజులలోని సింగి, సింగఁడు పాత్రలు మాఱి రామ నలహరిశ్చంద్ర సీతా దమయంతి చంద్రమత్యాదిపాత్రలు వచ్చినవి. కాని,