Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

viii

నెలకొని ఉన్నది కాబట్టి మహారాష్ట్ర వీరగాథలు, జానపద గాథాసాహిత్యం ద్వారా కాకతమ్మ, ఏకవీరులకు సంబంధించిన కొత్త సంగతులేవైనా తెలుస్తాయేమో పరిశీలించవలసిందిగా సాంఘిక సాహిత్య చరిత్రకారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. పీఠికా సంకలనంలో క్రీడాభిరామాన్ని గూర్చిన శ్రీ శాస్త్రిగారి పీఠిక వెలకట్టరానిది. మౌలికమైన మహాప్రాతిభమైన కృషి కాబట్టి దీనినిగూర్చి కొంత విపులంగా ఇక్కడ ప్రసక్తం చేయటం జరిగింది.

పూజ్యపాదులు శ్రీ ప్రభాకరశాస్త్రిగారి ఈ పీఠికల సంకలనంలో మూడు వంతులు శ్రీ వేంకటేశ్వరస్వామి సాహిత్యం, మూడు వంతులు ప్రాచీన కావ్య ప్రబంధ దేశి సాహిత్య సమీక్షలతోపాటు మూడు వంతులు ఆధునిక సాహిత్య అనుశీలనం కనపడటం విశేషం. వారిది సమగ్రమైన మూర్తిమంతం. పూర్ణయోగం. అందువల్ల దేనినిగూర్చి సంభావించినా అట్టుపుట్టానవాళ్ళతో సహా పాఠకులకు తెలియజేస్తారు. చిన్న అభిప్రాయం, లఘు సమీక్ష అయినా పర్యాప్తంగా ఉంటుంది. వారి అభిప్రాయాన్ని ఆశించిన వారికీ, తరవాత దానిని అవలోకించిన వారికీ కూడా తృప్తికరంగా ఉంటుంది. అహమిక, మమకారం, స్వీయమతాభినివేశం, పట్టుదల, ప్రాగ్ నిర్ణయం కనపడవు వారు ఏవిషయాన్ని ప్రస్తావిస్తున్నా. ఈ పదం అర్థం ఇది కాబోలు, ఇంతవరకు ఈ విషయాన్ని నిర్ధారించగల ఆధారాలు లభించలేదు, ఈ ప్రయోగానికి ఇదమిత్థ నిర్ణయ సమర్థమైన ఆకరంలేదు, ఇత్యాదిగా పరమ సాధుసుందరంగా వారి ఆత్మీయ వచస్సు విరాజమానమవుతుంది. సాధారణంగా సంస్కృత పండితులకు సంప్రదాయ పరినిష్ఠిత విద్వద్వరేణ్యులకు గతకాలము మేలు అనే దృక్పథం ఉంటుంది. వ్యాకరణం పట్ల పూర్వ పూర్వకవి ప్రయోగ శిరోధార్యత పట్ల మొగ్గు ఉంటుంది. కాని, శ్రీ ప్రభాకరశాస్త్రుల వారికి సంస్కృత సాహిత్యం పట్ల ఎంత ప్రీతి ఉన్నదో ప్రాకృతం పట్ల అంత మమత్వమూ ఉన్నది. దేవాలయం శిల్పం పట్ల, ఆగమ శాస్త్రాల పట్ల ఎంత అభిరుచి ఉన్నదో పాటిదిబ్బలపైన, అక్షరాలు అరిగిపోయిన బండరాళ్ళపైన, పాడుపడ్డ గుళ్ళలోని పాతగిల్లిన శాసనాలపట్ల అంత ఆసక్తి ఉన్నది. నాటి ప్రజా జీవితాన్ని బాగా తెలుసుకొంటేనే కాని, సామాజిక సాంస్కృతికమైన పరిణామాలను