164
మధురకవితలు
కురువంజి[1]
తొలుత ద్రావిడభాషలలో వెలసినదృశ్యరచనములు కురవంజు లనఁబడునవి. ఆంధ్రకర్ణాట ద్రవిడదేశముల యరణ్యములలో వసించునాటవికులు, చెంచులు, కురవలు (క్రోవ, కోయ) అనువారు. అందుఁ గురవజాతివారి
యంజె = అడుగు (నృత్యవిశేషము) కురవంజె[2] యనఁబడెను. చిందు, గంతు, గొండ్లి, అంజె, అంగ - ఇత్యాదులు నృత్యవిశేషములు. ఆంధ్రదేశమున బహుకాలముననుండి శివక్షేత్రములగు శ్రీశైలము ఇంద్రకీలనగరము (బెజవాడకొండ) మొదలగు పర్వతములమీదనుఁ నృసింహక్షేత్రములగు వేదాద్రులు (పెక్కులున్నవి. మంగళాద్రి, సింహాద్రి, గరుడాద్రి, మాల్యాద్రి, వెంకటాద్రి) మొదలగు పర్వతముల మీదనుఁ వర్షోత్సవములు (యాత్రలు, జాత్రలు, జాతరలు) జరుగునప్పు డక్కడికి నాగరక ప్రజలు చేరుచుండువారు. వారి వినోదమునకై యక్కడి యాటవికులు రాత్రులందు నృత్యవిశేషములు నెఱపి ధనార్జనము చేయుచుండువారు. అక్కడక్కడి కొరవజాతులవారు చేయు నృత్యములు కొరవంజులనఁబడెను. కొరవంజె యన్నపేరు తొలుత వారి నృత్యమునకును, బిదప నృత్యవిశిష్ట మయిన వారి చిన్ని చిన్ని గేయరచనలకునను, నాపై కురవజాతివారికిని గూడఁబేరైనది. కురవజాతి వారు తొలుత చేయునృత్యవిశేషము కాలక్రమమున నాయా పర్వతప్రదేశముల స్థలమాహాత్మ్యకథలతోను, శివవిష్ణులీలా కథలతోను మిళితము లయి గేయ విశిష్టనాట్యరూపములను బడసెను. అపుడు మాయాకిరాతవేషు లగు పార్వతీశివులకథలతో నున్నకిరాతార్జునీయము, నృసింహస్వామి చెంచీతను బెండ్లాడు స్థలమహాత్మ్యకథలు (చెంచీతకథ) కురవంజులుగా వెలసెను. ఇట్లు
- ↑ వాల్విచి గుజ్జరి విల్వేడు (?) దండలాస్యము కందుకక్రీడ యల్లికయును కొరవంజి (జె) శుభలీల గుజరాతి దేసి చౌపదము జక్కిణి దురుపదము మదనపదదౌత్యమును జోగిపదచాలి శారదాసామ్రాజ్యమును జిందు నవతి మచ్చరంబులు నాట్యకదంబంబు మొదలైన నాట్యముల్ హవణించునవరసజ్ఞు (విజయరాఘవనృపాలుని ప్రహ్లాదచరిత్ర - యక్షగానము) ఇందు కొరవంజి. నృత్యవిశేషముగానే పేర్కొనఁబడినది.
- ↑ కురువంజి, కురువ + అంజె (అంజ, అంజె, అంజియ రూపాంతరములు) కురవంజియు కురవంజెలనుండి కురవంజి అనురూప మేర్పడి యుండ వచ్చును.